ఇద్దరూ ఇద్దరేనా… ?

ఏపీలో రాజకీయం రెండు పార్టీల మధ్యనే ఉంది. అది కూడా ఇద్దరు నాయకుల వ్యక్తిగత పోరులాగా కనిపిస్తోంది. ఏపీలో రెండు కుటుంబాలు, రెండు కులాలు ఇలా ఎన్ని [more]

Update: 2021-06-02 12:30 GMT

ఏపీలో రాజకీయం రెండు పార్టీల మధ్యనే ఉంది. అది కూడా ఇద్దరు నాయకుల వ్యక్తిగత పోరులాగా కనిపిస్తోంది. ఏపీలో రెండు కుటుంబాలు, రెండు కులాలు ఇలా ఎన్ని చెప్పుకున్నా వైఎస్ నారా ఫ్యామిలీల చుట్టూనే మొత్తం ఏపీ రాజకీయం అల్లుకుపోయింది. ఒకరి దిగితే మరొకరు గద్దెనెక్కుతారు. వారు తప్పులు చేస్తే వీరు సరిదిద్దుతామంటారు. ఈ దిద్దుబాటు చర్యలతోనే పుణ్య కాలమంతా గడచిపోయేట్లుగా ఉంది. ఇక్కడో చిత్రం కూడా చెప్పాలి. జగన్ గత ఎన్నికల ముందు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. అదే చంద్రబాబు అయితే విపక్ష నేతగా మారి హైదరాబాద్ లోనే కాపురం ఉంటున్నారు. పాదయాత్రకు ముందు జగన్ కూడా కేరాఫ్ లోటస్ పాండ్ గా ఉంటే ఉండవల్లిలోని కరకట్ట పక్కన చంద్రబాబు నివాసం ఉండేవారు.

రెండు కళ్ళూ చాలవా…?

ఇలా ఇద్దరు నేతలూ సూర్య చంద్రుల మాదిరిగా ఒకరు ఏపీలో ఉంటే మరొకరు కనిపించరని సెటైర్లు కూడా అప్పట్లో ఉన్నాయి. అయితే గత అయిదేళ్ళలో జగన్ ఎన్నోసార్లు ఏపీకి వచ్చేవారు. ప్రజా సమస్యల మీద ఆందోళనలు నిర్వహించేవారు. కానీ రాత్రికి మాత్రం హైదరాబాద్ కి వెళ్ళిపోయేవారు. దాంతో ఆయన్ని ప్రవాసాంధ్రుదు అని టీడీపీ నేతలు నిందించేవారు. మరి ఇపుడు అదే చంద్రబాబు పక్క రాష్ట్రంలో ఉంటూ చోద్యం చూస్తున్నారు. కరోనా వేళ కూడా ఆయన హైదరాబాద్ ని వీడడానికి ఇష్టపడడంలేదు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా విమర్శలు చేయడమే తన వంతు అన్నట్లుగా ఉన్నారని కామెంట్స్ అయితే పడుతున్నాయి.

ఈయన అంతే …?

ఇక ముఖ్యమంత్రి జగన్ కి కష్ట జీవి అని మరో పేరు ఉంది. జగన్ రెక్కల కష్టమే ఈ అధికారం అని అంతా చెబుతారు. అదే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం తాడేపల్లిలోని ఇంటికే పరిమితం అయ్యారని విపక్షాలు విమర్శలు చేస్తూంటాయి. జగన్ నిరంతరం సమీక్షలే తప్ప తన క్యాంప్ ఆఫీస్ నుంచి అడుగు తీసి బయట పెట్టరు అన్నది మాత్రం ప్రధాన ఆరోపణ. మొదటి విడత కరోనా టైమ్ లో అలాగే చేశారు. అయితే అప్పట్లో కేసులు ఇంతగా లేవు కాబట్టి ఓకే. కానీ ఇపుడు రెండవ విడతలో ఏకంగా రోజుకు పాతిక వేల దాటి వస్తున్నాయి. అలాగే మరణాలు కూడా దారుణంగా ఉన్నాయి. ఇంకో వైపు చూస్తే బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో పని తీరు మీద ముఖ్యమంత్రి ఆకస్మిక టూర్లు వేస్తే బాగుంటుంది అన్న వారూ ఉన్నారు. కానీ ఆయన మాత్రం సమీక్షలే అంటున్నారు.

ఆన్ లైన్ లోనే …?

ఏపీలో రాజకీయం లేదా. నేతాశ్రీలు లేరా అంటే గజానికొక నాయకుడు కనిపిస్తాడు. మరి వీరంతా ఏమయ్యారు అంటే అంతా ఆన్ లైన్ లోనే ఉంటారు. అధికార విపక్ష నేతలు క్షెత్ర స్థాయి పర్యటనలు చేయకపోతే మిగిలిన పార్టీల నేతలు కూడా అదే తీరున ఉన్నారు. అయితే అంతా అలెర్ట్ గానే ఉంటున్నారు. ఏ చిన్న ప్రమాదం జరిగినా ఆన్ లైన్ లోనే ప్రకటనలతో తెగ జోరు చేస్తారు అన్న సెటైర్లు పడుతున్నాయి. టోటల్ గా ఏపీ పాలిటిక్స్ నేతల తీరు ఇలా ఉంది. మరి జనాలకు భరోసా ఇచ్చే నాధుడు ఉన్నారా అంటే జవాబు సులువే కానీ అది చాలా గుండె బరువు అయిన విషయం. అంతే ఏపీ జనాలు ప్రస్తుతానికి ఇలా సర్దుకుపోవాల్సిందే.

Tags:    

Similar News