Ys jagan : ఈసారి కమ్మ నేతలకే ఛాన్స్ అట

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈసారి తన ఆలోచనను మార్చుకున్నట్లే కనపడుతుంది. 11స్థానాల్లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పదకొండు చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి [more]

Update: 2021-11-10 02:00 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఈసారి తన ఆలోచనను మార్చుకున్నట్లే కనపడుతుంది. 11స్థానాల్లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పదకొండు చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకూ జగన్ దాదాపు పదికి పైగానే ఎమ్మెల్సీ స్థానాలను వివిధ కోటాల కింద భర్తీ చేశారు. అయితే అందులో కమ్మ సామాజికవర్గానికి ఇప్పటి వరకూ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు.

అధికారంలోకి వచ్చిన తర్వాత….

గత ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గం కూడా జగన్ కు అండగా నిలబడింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని పట్టించుకోవడం లేదన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. అన్ని రకాలుగా ఆ సామాజికవర్గాన్ని అణిచి వేయాలని ప్రయత్నం చేస్తున్నారని జగన్ పై ఆ సామాజికవర్గం గుర్రుగా ఉంది. కేబినెట్ లోనూ ఒక్కరికే అవకాశం కల్పించారు. దీంతో ఈసారి ఎమ్మెల్సీల ఎంపికలో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

మర్రి రాజశేఖర్ కు….

ప్రస్తుతం గుంటూరు జిల్లాలో రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ స్థానాలకు మర్రి రాజశేఖర్ పేరును ఖరారు చేశారంటున్నారు. మర్రి రాజశేఖర్ కు ఎప్పుడో ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో జగన్ ఆయనకు ఇవ్వకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈసారి మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ పదవి గ్యారంటీ అంటున్నారు. ఇటీవల ఇదే జిల్లా నుంచి లేళ్ల అప్పిరెడ్డిని ఎమ్మెల్సీగా ఎంపిక చేయడంతో ఈసారి మర్రి ఎంపిక ఖాయమని భావిస్తున్నారు.

తలశిలకు కూడా….

ఇక కమ్మ సామాజికవర్గం బలంగా ఉన్న కృష్ణా జిల్లా నుంచి రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమాల నిర్వాహకుడు తలశిల రఘురామ్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. కృ‌ష్ణా, గుంటూరు జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవులు నాలుగింటిలో రెండు జగన్ కమ్మ సామాజికవర్గానికే కేటాయించారని, ఇక అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Tags:    

Similar News