Ys jagan : కుప్పంలో కూడిక మొదలు.. తీసివేత తప్పదా?

చంద్రబాబుకు కుప్పంలో ఇబ్బంది పెట్టడానికి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం వైసీపీ ఇన్ ఛార్జి భరత్ కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. స్థానిక సంస్థల [more]

Update: 2021-11-12 13:30 GMT

చంద్రబాబుకు కుప్పంలో ఇబ్బంది పెట్టడానికి జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుప్పం వైసీపీ ఇన్ ఛార్జి భరత్ కు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవికి చిత్తూరు జిల్లా నుంచి భరత్ ను జగన్ ఎంపిక చేశారు. భరత్ ప్రస్తుతం కుప్పం నియోజకవర్గ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబును మరింత ముప్పు తిప్పలు పెట్టేందుకే జగన్ భరత్ ను ఎంపిక చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

బాబు కంచుకోటలో….

కుప్పం నియోజకవర్గం అంటే చంద్రబాబుకు కంచుకోట. ఏడుసార్లు నుంచి వరస గెలుపులు చూస్తూ ఆయన ధీమా ఉన్నారు. 2019 ఎన్నికల్లో మాత్రం కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు కన్పించాయి. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రమౌళి చంద్రబాబును ఓడించినంత పనిచేశారు. తొలి రెండు రౌండ్లలో ఆధిక్యత సాధించడంతో టీడీపీ శ్రేణులు కూడా కంగారు పడ్డాయి. గతంలో కంటే మెజారిటీని తగ్గించి చంద్రమౌళి వైసీపీ పార్టీ సత్తాను కుప్పంలో చూపించారు.

తండ్రి మరణం తర్వాత…

అయితే ఎన్నికల తర్వాత చంద్రమౌళి అనారోగ్య కారణాలతో మరణించారు. మాజీ ఐఏఎస్ అధికారిగా ఆయన కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తండ్రి మరణం అనంతరం భరత్ వైసీపీ జెండా అందుకున్నాడు. దీంతో జగన్ భరత్ ను కుప్పం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జిగా నియమించారు. అప్పటి నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప ల సలహలు, సూచనలతో కుప్పంలో వైసీపీని బలోపేతం చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో…

వరసగా కుప్పంలో వైసీపీ విజయం సాధిస్తుండటం కూడా జగన్ లో సంతోషాన్ని కల్గించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో వైసీపీ పట్టు సాధించింది. పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటింది. దీంతో భరత్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. ఈ మేరకు ఆయనకు అవకాశం కల్పించారు. కుప్పం నియోజకవర్గానికి చంద్రబాబు ఎమ్మెల్యేగా ఉన్నా, ఇక భరత్ ఎమ్మెల్సీగా మరింత చొచ్చుకుపోతారని జగన్ అంచనా వేస్తున్నారు. మరి భరత్ జగన్ అంచనాలు నిజం చేస్తారా? లేదా? అన్నది చూడాలి.

Tags:    

Similar News