Ys jagan ; అలా చేస్తేనే గెలుపా? ట్రాష్ అంటున్న సీనియర్లు

వైఎస్ జగన్ సామాజిక సమీకరణాల ఆధారంగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను చేస్తున్నారు. అయితే అన్ని సార్లూ ఇవి పనిచేస్తాయా? ప్రభావం చూపుతాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది. జగన్ [more]

Update: 2021-11-11 05:00 GMT

వైఎస్ జగన్ సామాజిక సమీకరణాల ఆధారంగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను చేస్తున్నారు. అయితే అన్ని సార్లూ ఇవి పనిచేస్తాయా? ప్రభావం చూపుతాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది. జగన్ ఏ పదవులు భర్తీ చేసినా యాభై శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు స్థానం కల్పిస్తున్నారు. వీరిలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సోషల్ ఇంజినీరింగ్ లో భాగంగా జగన్ ఈ విధంగా నిర్ణయాలు తీసుకోవచ్చు.

సామాజిక సమీకరణాలే…

కానీ ఎన్నికల సమయానికి సామాజిక సమీకరణాలు పనిచేస్తాయా? అన్న సందేహం కలగక మానదు. ఇప్పటి వరకూ జగన్ భర్తీ చేసిన పదవులన్నీ సామాజిక సమీకరణాల ఆధారంగానే చేశారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేసిన మూడు పదవుల్లోనూ అదే సూత్రాన్ని జగన్ పాటించారు. త్వరలో భర్తీ చేయనున్న 11 ఎమ్మెల్సీ స్థానాలను ఇదే ప్రాతిపదికన భర్తీ చేస్తారంటున్నారు.

మిగిలిన వారికి….

కానీ ఇలా చేసుకుంటూ పోతే మిగిలిన సామాజికవర్గాలకు అన్యాయం జరుగుతుందన్న విమర్శలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. గత ఎన్నికలలో చాలా మంది పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. వారిలో అగ్రకులాలు వారు సయితం ఉన్నారు. వారిని కాదని మిగిలిన సామాజికవర్గాలను భర్తీ చేసుకుంటూ జగన్ పోవడాన్ని కొందరు అగ్రనేతలే అభ్యంతరం చెబుతున్నారు. సమర్థత, సామర్థ్యం, ప్రభావం చూపే నేతలను ఎంపిక చేస్తేనే వచ్చే ఎన్నికలకు ఉపయోగపడతారంటున్నారు.

తెలంగాణలో ఏమైంది?

ఇందుకు వారు కొన్ని ఉదాహరణలు కూడా చూపుతున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలో హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం కేసీఆర్ అనేకమందికి పదవులు ఇచ్చారు. ఎల్.రమణ, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు, కౌశిక్ రెడ్డి వంటి వారిని చేర్చుకున్నా ఫలితం దక్కలేదు. ఒక నేతకు పదవి ఇచ్చినంత మాత్రాన ఆ సామాజికవర్గం మొత్తం పార్టీ వెంటే ఉంటుందనుకోవడం ట్రాష్ అని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ మాత్రం తాను చెప్పిన విధంగానే చేస్తానని చెబుతుండటం విశేషం.

Tags:    

Similar News