‘అమ్మ’ మనసు తెలిసిపోయింది

‘నీకు మా ఇద్దరిలో ఎవరంటే ఇష్టం’అన్న ప్రశ్న ఒక కుమారుడి నుంచో, కూతురు నుంచో ఎదురైతే ఆ తల్లికి బదులు దొరకదు. ఇద్దరూ బాగుండాలి. ఇద్దరూ తనకు [more]

Update: 2021-09-01 05:00 GMT

‘నీకు మా ఇద్దరిలో ఎవరంటే ఇష్టం’అన్న ప్రశ్న ఒక కుమారుడి నుంచో, కూతురు నుంచో ఎదురైతే ఆ తల్లికి బదులు దొరకదు. ఇద్దరూ బాగుండాలి. ఇద్దరూ తనకు సమానమే అని చెప్పాలని ఉంటుంది. సాధ్యమైనంతవరకూ ఇద్దరికీ సమన్యాయమే చేయాలని చూస్తుంది. కానీ తప్పనిసరిగా ఒకరినే ఎంచుకోవాల్సి వచ్చినప్పుడే ఆ తల్లి మనసు తల్లడిల్లిపోతుంది. తన జీవన అనుభవాన్ని, ధర్మాన్ని రంగరించుకుని నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు వై.ఎస్. విజయమ్మ పరిస్థితి అదే. రాజశేఖరరెడ్డి 30 ఏళ్ల పైచిలుకు ప్రజాజీవితాన్ని గడిపారు. నిత్యం రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. కానీ ఏనాడూ ఆమె జోక్యం చేసుకున్న సంగతి తెలియదు. కానీ ఆయన మరణానంతరం ఏడాదిలోపుగానే యాక్టివ్ పాలిటిక్స్ లోకి వై.ఎస్. విజయమ్మ రావాల్సి వచ్చింది. అది తన కోసమో, వై.ఎస్. ను నమ్ముకున్న అభిమానుల కోసమో కాదు. తన భర్త సాధించి పెట్టిన ప్రజావిజయం వారసులకు దక్కకుండా పోతుందనే ఆవేదనతోనే ఆమె రంగప్రవేశం చేశారు. అది గతం. ఆమె జీవితంలో ప్రజాజీవితానికి పునాది వేసిన ఘట్టం. ఇప్పుడు మరోసారి కూతురు, కొడుకు మధ్య వారసత్వ రాజకీయంలో ఒక వైపు మొగ్గుచూపాల్సిన తరుణం వచ్చింది. ఇది వర్తమానం. కుటుంబ సంబంధాల్లో కల్లోలం రేపే తరుణం. వై.ఎస్. వర్ధంతి సందర్బంగా ఆత్మీయ సమ్మేళనం , సంస్మరణ సభకు విజయమ్మ చేస్తున్న ఏర్పాట్లు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. కుమార్తె షర్మిల రాజకీయ భవితవ్యానికి పునాదులు వేసే క్రమంలోనే ఆమె పక్కాగా పావులు కదుపుతున్నారనే వార్తలు వినవస్తున్నాయి.

ఇంటి గుట్టు రచ్చ చేటు…

షర్మిల చాలా యాక్టివ్. నిజానికి జగన్ మోహన్ రెడ్డి వ్యాపారరంగంలో బిజీగా ఉన్న సమయంలోనే తండ్రికి చాలా దగ్గరగా ఉంటూ తనకు తోచిన సలహాలు, సూచనలతో తండ్రి మెప్పును షర్మిల పొందుతుండేవారు. ఒక రకంగా చెప్పాలంటే వై.ఎస్. కు జగన్ కంటే షర్మిల పట్లనే ఎక్కువ మక్కువ. ఆమె మాటను ఏనాడూ తోసిపుచ్చలేదు. వ్యక్తిగత జీవితం మొదలు, కుటుంబ అంశాల్లో నిర్ణయాల వరకూ షర్మిల చెప్పిందంటే ఆ ఇంట్లో కావాల్సిందే. ఈ విషయం తల్లి విజయమ్మకి తెలుసు. వివాహం తర్వాత బెంగుళూరు నివాసం, వ్యాపారాల్లో బిజీగా ఉండటంతో జగన్ మోహన్ రెడ్డి 2004 వరకూ రాజకీయాలకు చాలా దూరంగానే ఉన్నారు. తాత రాజారెడ్డితోనే ఆయనకు చనువు ఎక్కువ. రాజకీయ కార్యకలాపాలన్నీ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి చూసుకుంటుండేవారు. 2004లో వై.ఎస్. ముఖ్యమంత్రి అయిన తర్వాతనే జగన్ కు రాష్ట్ర రాజకీయాలపై ఆసక్తి పెరిగింది. వై.ఎస్. దుర్మరణం తర్వాత ఎదురీతకు సిద్దమై పదేళ్ల పోరాడారు. ఆ తర్వాతనే ముఖ్యమంత్రి అయ్యారు. ఇందులో షర్మిల పాత్ర తోసిపుచ్చలేనిది. పార్టీని తల్లీ కూతుళ్లు ముందుకు నడిపారు. జగన్ ఒకవైపు పాదయాత్ర సాగిస్తున్నప్పటికీ అతను విజయం సాధించేవరకూ విజయమ్మ, షర్మిల చేదోడువాదోడుగా నిలిచారు. సభలు, సమావేశాలు, ప్రజాయాత్రలు నిర్వహించారు. ఆ తర్వాత ఏర్పడిన పరిణామాల్లో షర్మిలకు పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ నామమాత్రపు ప్రాధాన్యం కూడా దక్కలేదు. దాంతో విభేదాలు పొడచూపాయి.

అన్నాచెల్లి..ఆమడ దూరం..

తండ్రి వారసత్వంలో తనకూ తగిన వాటా ఉందనేది షర్మిల వాదన. తన కష్టార్జితంతోనే అధికారం తెచ్చుకున్నాననేది జగన్మోహన్ రెడ్డి భావన. ఏదేమైనా అన్నాచెల్లెళ్ల మద్య రాజకీయ సత్సంబంధాలు లేవనేది మాత్రం వాస్తవం. నేరుగా ప్రభుత్వంతో సంబంధం లేకుండా కనీసం ఒక ఎంపీగానో, పార్టీకి ప్రధానకార్యదర్శిగానో పదవి ఇవ్వాలనేది విజయమ్మతో పాటు కుటుంబ సభ్యులు కొందరు చేసిన సూచన. దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించకుండా జగన్ చాలా కాలం పాటు నాన్చివేత ధోరణినే ప్రదర్శించారు. దాంతో షర్మిల సొంతపార్టీ పెట్టుకున్నారు. గడచిన ఏడాదికాలంగా వారిద్దరి మధ్య అంతరం పెరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పదవిలో ఉన్న జగన్ ను నేరుగా ఢీకొనడం అంత సులభం కాదు. అందులోనూ కుటుంబసభ్యులు, బంధువుల్లో ఎందరు తనకు సహకరిస్తారో తెలియదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో వైఎస్సార్ టీపీ పేరిట రాజకీయ పార్టీని పెట్టి అన్నకు కంటిలో నలుసుగా మారారు. తెలంగాణలో రాజకీయం చేసేందుకు తగిన ప్రాతిపదిక లేదనే విషయం షర్మిలకు తెలుసు. బహిరంగంగా ఎన్ని ప్రసంగాలు చేసినా లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే. కుటుంబ వేడుకలు, తండ్రి సంస్మరణల సందర్బంగానూ అన్నాచెల్లెళ్లు ఒకరినొకరు కలవడం లేదు. ఇది ఒక స్పష్టమైన విభజన రేఖగానే చూడాలి.

రాజకీయ‘పట్టు’ కోసం పంతం…

తనది కాని తెలంగాణలో షర్మిల ఒంటరిపోరాటం ఎందుకు చేస్తున్నారు? ఎన్నోఏళ్లపాటు పరిపాలించి, వెనకబడిన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం పెంచి, సంస్కరణలు, సంక్షేమాన్ని చవి చూపించిన తెలుగుదేశం పార్టీయే ఇక్కడ అస్తిత్వాన్ని కోల్పోయింది. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకిగా ముద్రపడిన వై.ఎస్. పేరుతో ఇక్కడ రాజకీయం చెల్లుబాటు అవుతుందా? వ్యక్తిగతంగా వై.ఎస్. కు అభిమానులు ఉండవచ్చు. కానీ రాజకీయంగా ప్రజానీకాన్ని ప్రభావితం చేసి అధికారం కోసం పోరాటం జరిపేంతటి బలం సాధ్యం కాదు. అయినా షర్మిల దీక్షలు, ఆందోళనల పేరిట ప్రధాన రాజకీయపార్టీల తరహాలోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తల్లి విజయమ్మ ఏర్పాటు చేస్తున్న వై.ఎస్. సంస్మరణ షర్మిల ఆలోచన నుంచి రూపుదిద్దుకున్నదేనని తెలుస్తోంది. ఈ సమావేశానికి ఎటొచ్చీ జగన్ హాజరుకారు. సమావేశం ద్వారా తాను కూడా రాజకీయ వారసురాలిగా ముద్ర వేయించుకోవడమే షర్మిల లక్ష్యం. అందుకు విజయలక్ష్మి ఆశీర్వచనాలు పలకడమే కాదు, సంపూర్ణంగా మద్దతునిస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News