ఒక నాయ‌కుడి కార‌ణంగా.. చిత్తూరు వెనుక‌బ‌డుతోందా..?

అధికార వైసీపీకి రాష్ట్రంలోని రెండు జిల్లాలు అత్యంత కీల‌కం. ఒక‌టి పార్టీ అధినేత జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌డ‌ప జిల్లా. రెండు ప్రధాన ప్రతిప‌క్ష నాయ‌కుడు చంద్రబాబు [more]

Update: 2020-10-31 13:30 GMT

అధికార వైసీపీకి రాష్ట్రంలోని రెండు జిల్లాలు అత్యంత కీల‌కం. ఒక‌టి పార్టీ అధినేత జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌డ‌ప జిల్లా. రెండు ప్రధాన ప్రతిప‌క్ష నాయ‌కుడు చంద్రబాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చిత్తూరు జిల్లా. క‌డ‌ప జిల్లా‌ను భారీ ఎత్తున అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే అనేక కార్యక్రమాలు, ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. ర‌హ‌దారుల విస్తర‌ణ నుంచి ఇంటింటికీ నీరు అందించేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నారు. గ్రేట‌ర్ విశాఖ త‌ర‌హాలో క‌డ‌ప జిల్లాలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను కూడా అభివృద్ధి చేసేలా మాస్టర్ ప్లాన్‌ను అమ‌లు చేస్తున్నారు సీఎం జ‌గ‌న్‌. ఈ బాధ్యత‌ను పూర్తిగా ఎంపీ అవినాష్‌రెడ్డికి అప్పగించారు.

పక్కా ప్లాన్ ప్రకారమే….

ఇక‌, చిత్తూరు విష‌యానికి వ‌స్తే.. ఇక్కడ ప్రధాన‌ ప్రతిప‌క్షం చంద్రబాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పం కూడా ఉంది. దీంతో ఈ జిల్లాలో వైసీపీ పాగా వేయాల‌నేది ఎప్పటి నుంచో ఉన్న వ్యూహ‌మే. మ‌రీ ముఖ్యంగా చంద్రబాబును ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఓడించి.. వైసీపీ గెలుపు గుర్రం ఎక్కేలా వ్యూహాత్మకంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక్కడ కూడా గ్రేట‌ర్ తిరుప‌తి స‌హా అనేక ప్రాంతాల‌ను తిరుప‌తి అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్ ప‌రిధిలోకి తీసుకువ‌చ్చారు. ఇక‌, కుప్పంను మినీ మునిసిపాలిటీగా అభివృద్ధి చేస్తున్నారు. దీనికి సంబంధించిన నిధులను కూడా చాలా వేగంగా ఇస్తున్నారు. ఏం చేయాలో ముందుగానే ప‌క్కా ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారు.

ప్రతి విషయంలోనూ జోక్యం…..

అయితే, చిత్తూరు జిల్లాకు చెందిన ఓ కీల‌క నాయ‌కుడు.. మంత్రి కూడా అయిన ఆయ‌న చ‌క్రం తిప్పుతుండ‌డంతో ప‌నులు ముందుకు సాగ‌డం లేద‌నే విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి విష‌యంలోనూ ఆయ‌న జోక్యం చేసుకుంటున్నార‌ని… ప్రతి దానిలోనూ కాసుల వ‌ర్షం కుర‌వాల‌నే ధోర‌ణితో ఉన్నార‌ని ఇక్కడ గుస‌గుస బాగానే వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో సొంత వారిని న‌మ్మడం మానేసి.. త‌నకు అనుకూలంగా ఉండే బెంగ‌ళూరుకు చెందిన న‌లుగురుని నియ‌మించుకుని వారి ద్వారా ఇక్కడ ప‌నుల‌ను ప‌ర్యవేక్షిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు తీవ్ర ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు.

చిన్న పనులైనా…..

ఆయ‌న మంత్రి కావొచ్చు.. కానీ, మేం కూడా ఈ పార్టీ స‌భ్యుల‌మేగా.. మాకు క‌నీసం మేలు చేయ‌లేరా ? అంటూ నిల‌దీస్తున్నారు. పార్టీ ప్రతిప‌క్షంలో ఉన్నప్పుడు అధికార ప‌క్షంపై పోరాటం చేసేందుకు.. ఆయ‌న వ‌రుస‌గా గెలిచేందుకు నియోజ‌క‌వ‌ర్గ, జ‌ల్లా నేత‌ల‌ను బాగా వాడుకున్న ఆ సీనియ‌ర్ నేత ఇప్పుడు వారిని పూర్తిగా ప‌క్కన పెట్టేశార‌ట‌. ద్వితీయ శ్రేణి నేత‌ల‌కు కూడా రూపాయి మిగిలే ప‌రిస్థితి లేకుండా చిన్న ప‌నుల నుంచి అన్ని ఆయ‌న క‌నుస‌న్నల్లోనే న‌డుస్తుండ‌డంతో ఇప్పుడు స‌ద‌రు నేత‌పై సొంత పార్టీ నేత‌ల్లోనే తీవ్ర వ్యతిరేక‌త వ్యక్తమ‌వుతోంది. ఇక జిల్లాలోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ మీడియం రేంజ్ ప‌నులు కూడా ఆయ‌న వ‌ర్గానికి / ఆయ‌న చెప్పిన వారికే ఇవ్వాల‌న్న ష‌ర‌తుల‌తో ఎమ్మెల్యేలు సైతం ఆయ‌న పేరు చెపితే విసిగి పోతోన్న ప‌రిస్థితి ఉంద‌ట‌. ఏదేమైనా.. స‌ద‌రు నేత వ్యవ‌హారంతో జిల్లాలో ప‌నులు పూర్తిగా వెనుక‌బ‌డుతుండ‌డంతో పాటు పార్టీ నేత‌ల్లో తీవ్ర వ్యతిరేక‌త పెరుగుతోన్న మాట వాస్తవం.

Tags:    

Similar News