అక్కడ మూడు సీట్ల‌కు కొత్త మొఖాలేనా… వైసీపీలో చ‌ర్చ‌

నెల్లూరు జిల్లాలో వైసీపీ ప‌రిణామాలు మారుతున్నాయా? ఇక్కడ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు యాక్టివ్ గా ఉంటున్న ఎమ్మెల్యేలు చాలా త‌క్కువ మంది [more]

Update: 2021-08-11 00:30 GMT

నెల్లూరు జిల్లాలో వైసీపీ ప‌రిణామాలు మారుతున్నాయా? ఇక్కడ గ‌త ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీలో ఇప్పుడు యాక్టివ్ గా ఉంటున్న ఎమ్మెల్యేలు చాలా త‌క్కువ మంది ఉన్నారు. మ‌రికొంద‌రు.. ఏదో ఉన్నామంటే ఉన్నామ‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల లోపు.. ఈ నేత‌లు పుంజుకోక‌పోతే.. ఈ ద‌ఫా టికెట్లు ద‌క్క‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నాయి జిల్లా వైసీపీ వ‌ర్గాలు. ఇలాంటి వారిలో ముఖ్యంగా ముగ్గురి పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. గూడూరు, వెంక‌ట‌గిరి, సూళ్లూరుపేట నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించి వైసీపీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి, ప్ర‌జ‌ల‌కు దూర‌మ‌వుతోన్న ప‌రిస్థితే ఉంద‌ని పార్టీలో చ‌ర్చ సాగుతోంది.

గూడూరు టిక్కెట్ ఫస్ట్ అవుట్……

గూడూరు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మాజీ ఐఏఎస్‌.. వ‌ర‌ప్ర‌సాద్ విజ‌యం ద‌క్కించుకున్నారు. 2014లో తిరుప‌తి ఎంపీగా గెలిచిన ఆయ‌న గ‌త ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్‌పై తీవ్ర ఒత్తిడి చేసి మ‌రీ గూడనూరు ఎమ్మెల్యే అయ్యారు. అయితే.. ఆయ‌న వ్య‌వ‌హార శైలిపై ఆది నుంచి కూడా విమ‌ర్శ‌లు ఉన్నాయి. త‌న‌దే పెత్త‌నం సాగాల‌నే ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. తిరుప‌తి ఉప ఎన్నిక స‌మ‌యంలోనూ పార్టీని స‌మ‌న్వ‌య ప‌ర‌చ‌డంలో వ‌ర‌ప్ర‌సాద్ విఫ‌ల‌మ‌య్యార‌ని.. ఆయ‌న వ్య‌వ‌హారంతో ఇక్క‌డ ఓట్లు కూడా త‌గ్గాయ‌ని.. పార్టీలో విమ‌ర్శ‌లు వున్నాయి. ఇక‌, అభివృద్ది ప‌రంగా చూసుకున్నా.. పెద్ద‌గా దూకుడు చూపించ‌లేక పోతున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గ వైసీపీ రాజ‌కీయాల‌ను కంట్రోల్ చేసే రెడ్డి వ‌ర్గం నేత‌లు అంద‌రూ ఆయ‌న్ను వ్య‌తిరేకిస్తున్నారు. దీంతో.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న వ్య‌వ‌హార శైలిని మార్చుకోక‌పోతే.. క‌ష్ట‌మ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ప‌క్క‌న పెట్టే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు.

బయటకు వెళతారని….

ఇక‌, వెంక‌ట‌గిరి విష‌యానికి వ‌స్తే.. ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి.. గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన ద‌గ్గ‌ర నుంచి అసంతృప్తితో ఉన్న విష‌యం తెలిసిందే. నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. కార్య‌క‌ర్త‌ల‌ను కూడా దూరం పెడుతున్నార‌ని.. ఆయ‌నపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అయితే.. మంత్రి వ‌ర్గంలో సీటు కోరుకుంటున్న ఆనం.. అసంతృప్తిని ప‌ట్టించుకునే తీరిక పార్టీ అధిష్టానానికి లేదు. ఈ క్ర‌మంలో ఆయ‌న వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌స్తార‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇదిలావుంటే, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇక్క‌డ నుంచి నేదురుమిల్లి రామ్‌కుమార్ రెడ్డికి ఛాన్స్ ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ విష‌యం నియోజ‌క‌వ‌ర్గంలో హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం.

సంజీవయ్యకు ఇబ్బందే….?

ఇక‌, సూళ్లూరు పేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవ‌య్య వ్య‌వ‌హారం కూడా పార్టీలో చ‌ర్చ‌కు దారితీస్తోంది. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా హైద‌రాబాద్‌లో ప్రాక్టీస్ చేసుకుంటున్నార‌ని.. సొంత వ్యాపారాల్లో బిజీగా ఉన్నార‌ని.. ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి సంజీవ‌య్య‌ను కూడా మారుస్తార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఆయ‌న వ‌రుస‌గా రెండుసార్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా ఉన్నా నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీపై ఎంత మాత్రం ప‌ట్టులేదు. అస‌లు శ్ర‌ద్ధ పెట్ట‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీనికితోడు ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ పుంజుకుంటుండ‌డం కూడా నేత‌ల మార్పున‌కు కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఈ ముగ్గ‌ురు ఎమ్మెల్యేలు పుంజుకుంటారో.. లేక‌.. టికెట్లు వ‌దులుకుంటారో చూడాలి.

Tags:    

Similar News