తిరుప‌తి ఫ‌లితం ముందుగానే తేలిపోయిందిగా ?

ఏపీలో త్వర‌లో జ‌రిగే తిరుప‌తి పార్లమెంటు ఉప ఎన్నిక ఫ‌లితం ముందే తేలిపోయిందా ? అక్కడ ఉప ఎన్నిక జ‌ర‌గ‌డం.. ఫ‌లితాల వెల్లడి అనేది నామ‌మాత్రం అయిపోయిందా [more]

Update: 2021-02-25 12:30 GMT

ఏపీలో త్వర‌లో జ‌రిగే తిరుప‌తి పార్లమెంటు ఉప ఎన్నిక ఫ‌లితం ముందే తేలిపోయిందా ? అక్కడ ఉప ఎన్నిక జ‌ర‌గ‌డం.. ఫ‌లితాల వెల్లడి అనేది నామ‌మాత్రం అయిపోయిందా ? అంటే స్థానిక సంస్థల ఎన్నిక‌ల ట్రెండ్స్ చూస్తుంటే అవున‌నే అని ఆన్సర్ వినిపిస్తోంది. ఈ ఉప ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని అటు ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీతో పాటు బీజేపీ, జనసేన ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే అటు టీడీపీతో పాటు జ‌న‌సేన – బీజేపీ కూట‌మికి రాష్ట్రంలో రోజు రోజుకీ పరిస్థితి క్లిష్టంగా తయారవుతోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్త ఫ‌లితాల‌ను ప‌క్కన పెడితే తిరుప‌తి పార్లమెంటు ప‌రిధి విస్తరించి ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వైసీపీ పూర్తి ఏక‌ప‌క్ష ఫ‌లితాలు న‌మోదు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లాలోనే రాష్ట్రంలో మిగిలిన జిల్లాల కంటే ఎక్కువ ఏక‌గ్రీవాలు న‌మోదు అయ్యాయి.

రెండో ప్లేస్ లోకి వచ్చేయాలని….

తిరుప‌తి ప‌రిధిలో వైసీపీకి ప్రజాబలం తగ్గలేదని, టీడీపీ చ‌చ్చీ చెడీ స‌గం పంచాయ‌తీల్లో అయినా అభ్యర్థుల‌ను నిల‌బెట్టుకోగ‌లిగితే జ‌న‌సేన – బీజేపీ దగ్గర మనుషులు లేరనే విషయం తేలిపోయింది. నాలుగు దశల్లోనూ వైసీపీ దూకుడు చూపించింది. టీడీపీని ప‌క్కన పెడితే ఇక్కడ గెల‌వ‌డం లేదా ఖ‌చ్చితంగా రెండో ప్లేసులోకి వ‌చ్చేయాల‌ని ఉబ‌లాట ప‌డుతోన్న బీజేపీని ప్రజ‌లు ఎంత మాత్రం విశ్వసించే ప‌రిస్థితి లేదు స‌రిక‌దా ? ఆ పార్టీతో క‌లిసి ఉంటే జ‌న‌సేన పాతాళంలోకి వెళ్లిపోయే ప్రమాదంలో ఉంది.

అన్ని రకాలుగా మొండి చేయి….

కేంద్ర బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి మొండి చేయితో పాటు … ఏపీకి ఎన్నో విష‌యాల్లో జ‌రుగుతోన్న అన్యాయం.. త్వర‌లో ఎన్నిక‌లు జ‌రిగే రాష్ట్రాల‌కు మాత్రమే తాయిలాలు ఇవ్వడం.. ఇటు విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలో బీజేపీ మ‌రింత విల‌న్ అయిపోవ‌డంతో అస‌లు ఆ పార్టీలో నాయ‌కులు త‌ప్పా కేడ‌ర్ కూడా మిగిలే ప‌రిస్థితి లేదు. ఈ ప‌రిణామాల త‌ర్వాత తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో నిన్నటి వ‌ర‌కు పోటీ చేస్తామ‌ని ఉర‌క‌లు వేసిన జ‌న‌సేన ఇప్పుడు పూర్తిగా వెన‌క్కు త‌గ్గడ‌మే కాకుండా బీజేపీతో క‌టిఫ్ చేసుకున్నా ఆశ్చర్యం లేదంటున్నారు.

మెజారిటీ ఎంత అనేదే…?

ఇక తిరుపతి ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పోటీ సంస్థాగ‌తంగా ప‌ట్టు కోల్పోతోన్న టీడీపీకి, అధికార వైఎస్సార్‌సీపీకి మ‌ధ్యే ఉంటుంద‌ని అంటున్నారు. టీడీపీ కొన్ని జిల్లాల్లో కాస్తో కూస్తో పుంజుకున్నా తిరుప‌తి పార్లమెంటు ప‌రిధిలో కొన్ని చోట్ల మ‌రింత దిగ‌జారింది. పార్లమెంటు ప‌రిధిలోని ఏడు నియోజ‌క‌వ‌ర్గాల్లో చాలా చోట్ల త‌మ పార్టీ సానుభూతిప‌రుల‌తో క‌నీసం నామినేష‌న్లు కూడా వేయించ‌లేని దుస్థితిని స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్‌లు, మాజీ మంత్రులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థిగా పేరు ఖ‌రారు అయిన కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మి ఈ ఫ‌లితాలు చూశాక‌.. చివ‌రి వ‌ర‌కు పోటీలో ఉంటారా ? అన్నది కూడా సందేహ‌మే ? ఇక వైసీపీ మెజార్టీపైనే ఎక్కువ త‌క్కువ లెక్కలు వేసుకోవ‌డం మిన‌హా తిరుప‌తి ఫ‌లితం మారే ఛాన్సే లేదు.

Tags:    

Similar News