ఫ్యాక్ట్ చెక్: సీఎం రేవంత్ రెడ్డికి చెందిన పాత వీడియోను ఇటీవలిదిగా వైరల్ చేస్తున్నారు

వైరల్ వీడియో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వకముందు;

Update: 2024-11-28 14:14 GMT
ఫ్యాక్ట్ చెక్: సీఎం రేవంత్ రెడ్డికి చెందిన పాత వీడియోను ఇటీవలిదిగా వైరల్ చేస్తున్నారు
  • whatsapp icon

ఇటీవలి కాలంలో తెలంగాణ లోని పలు ప్రాంతాల్లోని స్కూళ్లలో విద్యార్థులకు అందించిన భోజనాల్లో నాణ్యత లోపించిందంటూ కథనాలు వచ్చాయి. వీటిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. 

ఈ సమస్యలను అడ్డుకోడానికి, వివిధ సంస్థలలో వడ్డించే ఆహారాన్ని పర్యవేక్షించడానికి ఆహార భద్రతా కమిటీలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ప్రధానోపాధ్యాయుడు లేదా ప్రిన్సిపాల్ లేదా వార్డెన్ సంస్థలోని మరో ఇద్దరు సిబ్బంది ఉంటారు. కమిటీ ప్రతి భోజనం వండే ముందు స్టోర్ రూమ్, వంటగదిని తనిఖీ చేయాలి. వంటగదిలో నాణ్యత, పరిశుభ్రతను నిర్ధారించాల్సి ఉంటుంది. భోజనం తయారు చేసిన తరువాత, కమిటీ సభ్యులు ఆహార నాణ్యత, ఇతర కారణాల కోసం రుచి చూడాలి. తరువాత విద్యార్థులకు ఆహారాన్ని అందించాలి. ప్రతిరోజు కమిటీ ఈ కార్యక్రమాలను ఫొటోలు తీసి రికార్డు నిర్వహించాలి. నోడల్ విభాగం ఫోటోలను అప్‌లోడ్ చేయడానికి మొబైల్ ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేయనుంది. ప్రతి సంస్థకు మండల/ డివిజనల్/ జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షక అధికారులుగా నియమించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ అధికారులు భోజనం వండడానికి ముందు తర్వాత సంస్థను సందర్శించి విద్యార్థులకు వడ్డించే ముందు ఆహారాన్ని తినాలని ప్రధాన కార్యదర్శి తెలిపారు.

ఇంతలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన టేబుల్ మీద రకరకాల వంటకాలతో భోజనం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం పెట్టకుండా ప్రభుత్వ పెద్దలు మాత్రం అద్భుతమైన భోజనాన్ని తింటున్నారని ఆరోపిస్తూ పోస్టులు పెడుతున్నారు.



ఢిల్లీ, ఇతర ప్రాంతాలకు తిరుగుతూ సీఎం బిజీబిజీగా ఉండగానే రాష్ట్రంలోని విద్యార్థులు పురుగుల ఆహారం తినాల్సి వస్తోంది. ఆయన విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్నారు, కానీ రాష్ట్రంలో ఫుడ్ పాయిజనింగ్ ఆందోళనకరమైన పరిస్థితిని సమీక్షించడానికి ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఆరోపించింది.

"మనకేమో పురుగుల అన్నం,
ముఖ్యమంత్రికేమో మటన్ చికెన్ బోటి కూరలు.." అంటూ మరికొందరు పోస్టులు పెడుతున్నారు.



వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.



 

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టులు ఇటీవలివి కావు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వక ముందు ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన విజువల్స్.

వైరల్ పోస్టు కింద కామెంట్స్ ను మేము గమనించాం. అందులో పలువురు తెలంగాణ అసెంబ్లీ ఫలితాలకు ముందు జరిగిన ఘటనలు అంటూ చెప్పడం గమనించాం.




దీన్ని క్యూగా తీసుకుని వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఈ వీడియో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రికార్డు చేసిన ఇంటర్వ్యూ అని గుర్తించాం.

SoSouth అనే యూట్యూబ్ ఛానల్ లో On Campaign Trail- Breakfast with Congress Leader, Revanth Reddy | #TelanganaElections2023 | SoSouth అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు. ఇండియా టుడే తరపున రాజ్ దీప్ సర్దేశాయ్ రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయడం ఇందులో చూడొచ్చు.

Full View


ఎలక్షన్స్ క్యాంపెయిన్ సమయంలో ఈ వీడియో రికార్డు చేశారని అందులో స్పష్టంగా మాట్లాడారు. నవంబర్ 24, 2023న ఈ వీడియోను అప్లోడ్ చేశారని తెలుస్తోంది.

రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7, 2023న బాధ్యతలు చేపట్టారు. కాబట్టి, రేవంత్ రెడ్డి టిఫిన్ చేస్తున్న వీడియో సీఎం అవ్వకముందే అని తెలుస్తోంది.

ఇదే వీడియోను India Today యూట్యూబ్ ఛానల్ లో Telangana Has Decided To Get Rid Of KCR And His Family By...: Telangana Cong Chief Revanth Reddy అనే టైటిల్ తో నవంబర్ 23, 2023న వీడియోను పోస్టు చేశారు.

Full View

కాబట్టి, వైరల్ వీడియో తెలంగాణ సీఎం అవ్వకముందు రేవంత్ రెడ్డికి సంబంధించిన వీడియో ఇది.

వైరల్ పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.


Claim :  వైరల్ వీడియో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు రికార్డు చేసిన ఇంటర్వ్యూ లోనిది
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News