ఫ్యాక్ట్ చెక్: ఖమ్మంలో మొసలి వచ్చిందనే వాట్సప్ మెసేజీ నిజం కాదు. వడోదరకు సంబంధించింది.
వరదలకు ఖమ్మంలో మొసలి వచ్చిందనే వాట్సప్
చాలా ఇళ్ళు నీటమునిగి పోయాయి. తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా అందుబాటులో లేదు. ఖమ్మం రూరల్ మండలం కర్ణగిరిలో పలువురు చిక్కుకుపోయారు. ఖమ్మం జిల్లా బొక్కలగడ్డలో వరద నీటిలో చిక్కుకున్న కుటుంబం తమను రక్షించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును వేడుకున్నారు. వరదల కారణంగా తమ ఇంటి గోడలు దెబ్బతిన్నాయని, ఏ క్షణంలోనైనా కూలిపోతుందేమోనని భయాందోళనకు గురవుతున్నామని బొక్కలగడ్డకు చెందిన ఓ మహిళ తెలిపారు.
ఖమ్మం నగరంలోని మున్నేరు నదికి సమీపంలోని దాదాపు 25 కాలనీల్లోని వారి ఇళ్లను 10 అడుగుల ఎత్తులో నీరు చుట్టుముట్టడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బాధితులు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని, సురక్షిత ప్రాంతాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత రెండు రోజులుగా మునుపెన్నడూ లేని విధంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఖమ్మం జిల్లాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఖమ్మం నగరంలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో వరద మట్టం 36 అడుగులకు చేరుకుంది. 1984 తర్వాత ఇంత ఉధృతంగా ప్రవహించడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. దీంతో బొక్కలగడ్డ, మోతీనగర్, దాంసలాపురం, దానవాయిగూడెం, ప్రకాష్ నగర్, కాల్వొడ్డు ప్రాంతాల్లో వరదనీరు ఇళ్లపైకి చేరింది.
ఇంతలో ఓ మొసలి నీటిలో నుండి బయటకు వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఖమ్మంలో మొసలి నోట ఓ కుక్కను కరుచుకుని ఉండడం మనం గమనించవచ్చు. నీటిలో అడుగుపెట్టే ముందు మీరందరూ జాగ్రత్తగా ఉండండంటూ వీడియోను షేర్ చేస్తున్న వ్యక్తులు చెబుతున్నారు.
ఖమ్మం: కుండపోత వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఖమ్మం నగరంలో బీభత్సం సృష్టించింది. పలు కాలనీలు ముంపులో చిక్కుకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీని మున్నేరు వరద ముంచెత్తింది. అక్కడి నీటిలో ఓ మొసలి కనిపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పటికే మొసలి ఓ కుక్కను చంపినట్లు తెలుస్తోంది. నీటిలో అడుగుపెట్టే ముందు మీరందరూ జాగ్రత్తగా ఉండండి" అంటూ ఓ మెసేజీ వాట్సాప్ లో వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఆ వీడియో తెలుగు రాష్ట్రాలకు చెందినది కాదు. వడోదరకు సంబంధించింది.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. ఈ వీడియో ఖమ్మంలో వరదలు రాకముందు నుండి కూడా ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్నాయని తేలింది.
Akkivlogs అనే యూట్యూబ్ ఛానల్ లో ఆగస్టు 28న అప్లోడ్ చేసిన ఈ వీడియోను మేము గమనించాం.
Best Moment Compilations అనే యూట్యూబ్ ఛానల్ లో కూడా ఆగస్టు 28న అదే వైరల్ వీడియోను అప్లోడ్ చేశారు.
Full View
గుజరాత్ కు చెందిన Gopi Maniar ghanghar అనే ఇండిపెండెంట్ జర్నలిస్టు కూడా ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో ఆగస్టు 27న పోస్టు చేశారు.
దీన్ని బట్టి, వైరల్ వీడియో ఖమ్మంలో వరదలు వచ్చినప్పటి కంటే కొన్ని రోజులు ముందు నుండే ఆన్ లైన్ లో అందుబాటులో ఉంది.
ఇక సంబంధిత కీవర్స్ ను ఉపయోగించి గూగుల్ లో సెర్చ్ చేయగా, ఆగస్టు నెలలో వడోదరలో కూడా వరదలు సంభవించాయని, ఆ సమయంలో పలు ప్రాంతాల్లో మొసళ్లు కనిపించాయనే నివేదికలను మేము గమనించాం.
"గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తిన భారీ వర్షాల కారణంగా వడోదర నగరంలో భయానక పరిస్థితి నెలకొంది. పొంగిపొర్లుతున్న విశ్వామిత్ర నది కారణంగా వీధుల్లో మొసళ్లు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఒక మొసలి కుక్కను తన నోటితో పట్టుకున్నట్లు కనిపించిన అటువంటి సంఘటన చోటు చేసుకుంది. దీంతో ప్రమాదకరమైన ఈ సరీసృపాల భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి స్థానికులు జంకుతున్నారు" అంటూ lokmattimes.com లో కథనం కనిపించింది.
https://www.lokmattimes.com/national/gujarat-rains-crocodile-spotted-roaming-flooded-streets-of-vadodara-with-dog-in-its-jaws-watch-video-a507/
లేటెస్ట్లీ వెబ్సైట్ లో కూడా వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్ తో కథనాన్ని ప్రచురించారు.
https://www.latestly.com/socially/india/news/vadodara-rains-crocodile-roams-in-residential-area-in-flood-waters-with-dog-clutched-into-its-jaws-video-surfaces-6223236.html
కాబట్టి, ఖమ్మంలో మొసలి కనిపించిందంటూ వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో గుజరాత్ రాష్ట్రంలోని వడోదరకు సంబంధించింది.