ఫ్యాక్ట్ చెక్: కుంభమేళాలో పాపులర్ అయిన మోనాలిసా ఐఏఎస్ ఆఫీసర్ అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
కుంభమేళాలో కనిపించిన మోనాలిసా;

కుంభమేళా సందర్భంగా తన అందంతో అందరి దృష్టిని ఆకర్షించిన మోనాలిసా సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. అయితే, ఆమె వైరల్‌గా మారడంతో అనేక వాదనలు, పుకార్లు కూడా వ్యాపించాయి. ఆమె మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగర నివాసి, ఆమె తన కుటుంబంతో కలిసి కుంభమేళాలో రుద్రాక్ష, ముత్యాల దండలు విక్రయించడానికి వచ్చింది. ఆమె సింప్లిసిటీ, అందం గురించి వీడియో వైరల్ అవ్వడంతో ఆమె చాలా సమస్యలను కూడా ఎదుర్కొంది.
యూట్యూబర్‌ల నుండి సాధారణ వ్యక్తుల వరకు అందరూ ఆమెతో ఇంటర్వ్యూ చేయడానికి, ఫోటోలు తీయడానికి ఆసక్తి కనబర్చారు. మోనాలిసాను వాళ్ల నాన్న పంపించేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. కొందరు తనను బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు వచ్చారని మోనాలిసా తెలిపింది. ఇలాంటి పరిణామాల కారణంగా ఆమె ఇబ్బంది పడింది.
ఇంతలో మారువేషంలో వచ్చిన కలెక్టర్ మోనాలిసా అంటూ పోస్టులు పెట్టడం మొదలు పెట్టారు. rampage_memes__ అనే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో మోనాలిసా గురించి వచ్చిన పోస్టు వైరల్ అయింది. నాలుగు లక్షల మందికి పైగా ఆ వీడియోను వైరల్ చేశారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను ఇక్కడ చూడొచ్చు:
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మోనాలిసా గురించి పలు వివరాలు మీడియా సంస్థలు నివేదించాయి. ఆమె పెద్దగా చదువుకోకపోవడమే కాకుండా.. ఆమె తన వయసు కేవలం 16 సంవత్సరాలేనని స్వయంగా ఆమె ఒప్పుకుంది.
మోనాలిసా ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆమెకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో మహా కుంభమేళాలో ఆమె దండలు అమ్ముతూ ఉంది. కొన్ని గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ ను సొంతం చేసుకుంది. మోనాలిసా ప్రజాదరణ పొందడంతో ఆమె దగ్గర దండలు కొనడం మాని ఆమెతో సెల్ఫీలు తీసుకోవడం మొదలు పెట్టారు. వీడియోలను రికార్డ్ చేయడంపై దృష్టి పెట్టడంతో. ఆమె కుటుంబ వ్యాపారాన్ని ప్రభావితం చేసింది. మోనాలిసా తండ్రి ఆమెను ఇండోర్‌కు తిరిగి పంపాలని నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు ధృవీకరించాయి.
వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
పలు వీడియోలలో మోనాలిసా తన కుటుంబం గురించి, తన చదువు, వయసు గురించి చెప్పడం వినవచ్చు. తాను అసలు చదువుకోలేదంటూ మోనాలిసా చెప్పింది. ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా 2025లో, ఇండోర్‌కు చెందిన 16 ఏళ్ల దండలు అమ్మే అమ్మాయి మోనాలిసా భోంస్లే ఇంటర్నెట్ లో సంచలనంగా మారింది. ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తున్న భారీ మతపరమైన సమావేశంలో ఈ యువతి ప్రజాదరణ సొంతం చేసుకుంది. మోనాలిసా తక్కువ సమయంలో వైరల్ సంచలనంగా మారింది.
ఈ వీడియోలో 1 నిమిషం 50 సెకండ్ల వద్ద తాను అసలు చదువుకోలేదని చెప్పడం వినొచ్చు
ఇక వైరల్ వీడియో నుండి స్క్రీన్ షాట్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఐఏఎస్ అధికారిణి సబర్వాల్ కు సంబంధించిన ఫోటోను మార్ఫింగ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఆ రెండు ఫోటోలను ఇక్కడ చూడొచ్చు.
స్మితా సబర్వాల్ ట్విట్టర్ లో పోస్టు చేసిన ఫోటో
వైరల్ ఫోటోను ఇక్కడ చూడొచ్చు:
రెండు ఫోటోలలో బ్యాగ్రౌండ్ లో ఉన్నవి ఒకటే అని చూడొచ్చు. చేతికి ఉన్న వాచ్, ముందు ఉన్న టేబుల్స్, వెనుక ఉన్న వాటర్ బాటిల్స్ ఇవన్నీ రెండు ఫోటోలలో ఒకేలా ఉన్నాయి. కేవలం ముఖాన్ని మాత్రమే మార్ఫింగ్ చేశారని తెలుస్తోంది.
పలువురు మహిళలకు సంబంధించిన ఫోటోలను ఉపయోగించి కూడా మోనాలిసా లాగా ఎడిట్ చేశారని మేము గుర్తించాం. అంతేకాకుండా ఏఐ ను ఉపయోగించి వీడియోను సృష్టించారు.
కాబట్టి, మోనాలిసా కలెక్టర్ అనే వాదనలో ఎలాంటి నిజం లేదు
Claim : కుంభమేళాలో కనిపించిన మోనాలిసా ఓ ఐఏఎస్ ఆఫీసర్
Claimed By : Social Media Users
Fact Check : False