ఫ్యాక్ట్ చెక్: సెప్టెంబరు 15, 2024న బెంగళూరులో గ్రహశకలం పడడం వైరల్ వీడియో చూపడం లేదు, వీడియో పాతది
ఇటీవల, NASA ప్రమాదకరమైన గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే.
By - Satya Priya BNUpdate: 2024-09-16 11:49 GMT
ఇటీవల, నాసా ప్రమాదకరమైన గ్రహశకలం భూమిని ఢీకొట్టబోతోందంటూ హెచ్చరిక జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు ఏమి జరుగుతుందా అని చాలా మందే టెన్షన్ పడ్డారు. '2024 ON' అనే గ్రహశకలం భూమి వైపు దూసుకువస్తోందని, సెప్టెంబర్ 15, 2024న భూమికి దగ్గరగా వెళుతుందని నాసా తెలిపింది. ఆ గ్రహ శకలం 40233 km/h వేగంతో దూసుకువస్తోందని నాసా చెప్పడం, భూమి మీద పడితే సర్వనాశనం జరుగుతుందంటూ ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ గ్రహశకలం గురించి చర్చ జరిగింది.
2024 ON గ్రహశకలం జూలై 27, 2024న ATLAS స్కై సర్వే ద్వారా కనుగొన్నారు. నాసా కు చెందిన నియర్-ఎర్త్ ఆబ్జెక్ట్ అబ్జర్వేషన్స్ ప్రోగ్రామ్ ఈ ఖగోళ సంఘటనపై కాలిఫోర్నియాలోని జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ (JPL) ద్వారా నిశితంగా గమనిస్తోంది. ఇంతలో, అందరూ చూస్తుండగానే, నగరంపై ఓ పచ్చటి ఉల్క మండుతూ దూసుకువస్తున్నట్లు చూపించే ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. సెప్టెంబర్ 15, 2024న బెంగుళూరు నగరంలో గ్రహశకలం పడిందనే వాదనతో పోస్టులను ప్రచారం చేస్తున్నారు.
“Will an asteroid hit Earth on 15 September? A "potentially hazardous" asteroid named 2024 ON #asteroid” అనే క్యాప్షన్స్ తో వీడియో ను షేర్ చేస్తున్నారు.
“Bangluru m dekha 2 am asteroid#trending #viralvideo # YouTube” అంటూ మరికొందరు వీడియోను పోస్టు చేశారు. కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగిందని పోస్టుల ద్వారా చెబుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. వీడియో పాతది, సెప్టెంబర్ 15, 2024న గ్రహశకలం భూమి మీదకు దూసుకుని వచ్చిన ఘటనకు సంబంధించింది కాదు. మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేశాం. సంబంధిత వివరాల కోసం వెతికాం. వైరల్ వీడియో జూలై 2024 నుండి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు మేము కనుగొన్నాము.
టర్కీ దేశంలోని నగరమైన ఇస్తాంబుల్ లో ఉల్కాపాతం కనిపించిందనే శీర్షికతో “గ్లోబల్ డిజాస్టర్స్ న్యూస్” అనే ఫేస్‌బుక్ పేజీలో సుదీర్ఘమైన వీడియోను జూలై 06, 2024న షేర్ చేశారు.
వైరల్ వీడియోను
Dailymotionలో Haberler.com షేర్ చేసింది. అందులో కూడా ఇస్తాంబుల్ లో కనిపించిన ఘటన అంటూ తెలిపారు. ఇస్తాంబుల్, అంకారా, సకార్య, బుర్సాతో సహా అనేక ప్రావిన్సులలో ఆకాశంలో ఉల్క కనిపించిందని వీడియో వివరణ పేర్కొంది. ఇస్తాంబుల్‌లోని అనేక ప్రాంతాల నుండి కనిపించే ఉల్కాపాతం కెమెరాలకు చిక్కింది. విజువల్స్ ను చిత్రీకరించిన పౌరులు ఆశ్చర్యపోయారు.
Torquenews అనే యూట్యూబ్ ఛానల్ లో జులై 6, 2024న వీడియోను పోస్టు చేశారు.
అనేక టర్కిష్ నగరాలకు చెందిన వినియోగదారులు ఆకాశంలో ఫైర్‌బాల్‌లను చూసినట్లు నివేదించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి, చాలా మంది ఇది ఉల్కాపాతం కావచ్చునని సూచించారు. షేర్ చేసిన కొన్ని వీడియోలు ఇక్కడ చూడొచ్చు. అయితే, టైమ్స్ నౌ వీడియోల ప్రామాణికతను ధృవీకరించలేదు.
‘The Sun’ లో అందుకు సంబంధించిన ఆర్టికల్ ను కూడా పబ్లిష్ చేశారు. ‘The absurd object was seen shooting across the sky, onlookers watched in amazement’ అనే టైటిల్ తో పోస్టు పెట్టారు.
ది గార్డియన్ ప్రకారం, ఉల్కాపాతం సఫ్రాన్‌బోలు నగరంలో కనిపించింది అనీ, అయితే సఫ్రాన్‌బోలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాస్టమోనులో కూడా ఈ ఉల్కపాతం కనిపించింది. ఒక ఉల్కాపాతం టర్కీపై ఆకాశాన్ని వెలిగించింది, మేఘాల గుండా ఆకుపచ్చ కాంతిని ప్రసరించింది.
X పోస్ట్‌లో, టర్కిష్ స్పేస్ ఏజెన్సీ ఉల్కాపాతం జరిగిందని ధృవీకరించింది.
అందువల్ల, వైరల్ వీడియో సెప్టెంబరు 15, 2024న బెంగుళూరు నగరంలో గ్రహశకలం కిందపడడాన్ని చూపలేదు. ఇది జూలై 2024 నుండి ఆన్‌లైన్‌లో ఉంది. టర్కీలో ఆకుపచ్చ రంగులో ఉల్కాపాతం కనిపించింది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : సెప్టెంబరు 15, 2024న బెంగళూరులో ఒక గ్రహశకలం భూమిని ఢీకొట్టినట్లు వైరల్ వీడియో చూపుతోంది
Claimed By : Social media users
Fact Check : Misleading