Mohan Babu : తండ్రీకొడుకుల.. యుద్ధం గడప దాటిందిగా... ?
మంచు మోహన్ బాబు ఇంటి గొడవలు పోలీస్ స్టేషన్ కు పాకాయి. మోహన్ బాబు, మనోజ్ లు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు
మంచు మోహన్ బాబు ఇంటి గొడవలు పోలీస్ స్టేషన్ కు ఎక్కాయి. ఇటు తండ్రి మోహన్ బాబు, అటు కుమారుడు మనోజ్ లు ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఫిర్యాదులు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నటుడు మోహన్ బాబు ఇంట్లో గత కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఇంటి గడప దాటి పోలీస్ స్టేషన్ గడప తొక్కాయి. తన కుమారుడు మనోజ్, కోడలు మౌనికపై చర్యలు తీసుకోవాలంటూ మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన రాచకొండ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. తాను జల్పల్లిలో పదేళ్లుగా ఉంటున్నానని, నాలుగు నెలల క్రితం ఇంటిని విడిచిపెట్టి వెళ్లిన తన కొడుకు మనోజ్ కొందరితో కలసి తన ఇంట్లో గొడవలకు దిగారని ఆరోపించారు.
తన కుమార్తెను ఇంట్లో వదిలి...
మనోజ్ తన ఏడు నెలల కుమార్తెను తన ఇంటి పనిమనిషి చూసుకుంటుందని తెలిపారు. అంతేకాకుండా మాదాపూర్ లోని తన కార్యాలయంలో 30 మంది వ్యక్తులతో కలసి వచ్చి తనను బెదిరించారని కూడా తెలిపారు. మనోజ్, మౌనిక తన ఇంటిని అక్రమంగా ఆక్రమించుకుని తన ఉద్యోగులను సయితం బెదిరిస్తున్నారని తెలిపారు. తన ఆస్తుల విషయంలో భయపడుతున్నానని, 78 ఏళ్ల వయసున్న సీనియర్ సిటిజన్ ను తాను అని, తన ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి వారు ప్రయత్నించారని ఆరోపించారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. తన భద్రత కోసం అదనపు సిబ్బందిని కూడా కేటాయించాలని కోరారు. తనకు మనోజ్, మౌనికల నుంచి రక్షణ కల్పించాలంటూ మోహన్ బాబు రాచకొండ కమిషనర్ ను కోరారు.
మనోజ్ ఏమన్నారంటే?
మరోవైపు మంచు మనోజ్ కూడా పహాడీషరీఫ్ పలీసులకు ఫిర్యాదు చేశారు. కొందరు వ్యక్తులు తన భార్య మౌనికపై దాడి చేశారని, తనకు, తన భార్యకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. దీంతో పాటు మంచు మనోజ్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టు కూడా మోహన్ బాబు ఇంట్లో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. తన భార్య, తనపై మోహన్ బాబు చేసిన దురుద్దేశపూరితమైన, తప్పుడు, నిరాధార ఆరోపణలను ప్రస్తావిస్తున్నందుకు బాధగా ఉందన్నారు. తన తండ్రి మోహన్ బాబు లేవనెత్తే అంశాలుతప్పు మాత్రమే కాకుండా, తన పరువు, మర్యాదలకు భంగం కలిగించేలా ఉన్నాయని చెప్పారు. తన గొంతు వినిపించకుండా కుటుంబంలో అనవసర కలహాలు లేవనెత్తడానికే ఈ ప్రయత్నం చేస్తున్నారని మంచు మనోజ్ ఆరోపించారు.
ఆస్తులు అడగలేదు...
తను ఎవరిపై ఆధారపడి బతకడం లేదని, గౌరవంగా సమాజంలో బతుకుతున్నప్పటికీ, ఆర్థిక సాయం కోసం వారిపై తాను ఎన్నడూ ఆధారపడకపోయినప్పటికీ అనవసర ఆరోపణలు చేస్తున్నారన్నారర. తాను ఎలాంటి ఆస్తిపాస్తులు అడగలేదని, ఆ ఆలోచన కూడా సరైంది కాదని మనోజ్ అభిప్రాయపడ్డారు. ఈ వివాదంలోకి ఏడు నెలల త నకూతురిని కూడా లాగడం విచారకరమని అన్నారు. పిల్లలను గొడవల్లోకి లాగవద్దని మనోజ్ అభ్యర్థించారు. ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా మాయం చేశారన్నారు. తాను ఎనిమిదేళ్లుగా విరామం లేకుండా తన తండ్రి, సోదరుడు చిత్రాల కోసం పనిచేశానని, కానీ కొందరి పట్ల పక్షపాత ధోరణితో తన తండ్రి వ్యవహరిస్తున్నాడని మనోజ్ తెలిపారు. తన కుటుంబం పరువు కాపాడుకోవడానికి పెద్దల ముందు చర్చలు జరపాలని చెప్పానని, అయినా తన తండ్రి మోహన్ బాబు పట్టించుకోలేదని మంచు మనోజ్ తెలిపారు.