BegumBazar: బేగంబజార్ ఫుడ్ స్టాల్స్.. సోదాల్లో తేలింది ఏమిటంటే?
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో
తెలంగాణ ఫుడ్ సేఫ్టీ అధికారులు హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో దాడులను కొనసాగిస్తూ ఉన్నారు. జూలై 26, శుక్రవారం నాడు అధికారులు బేగంబజార్ ప్రాంతంలోని ధాబాతో పాటూ, పలు స్వీట్ల దుకాణాలపై దాడులు చేశారు. కమీషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ తెలంగాణ ప్రకారం.. బేగంబజార్‌లోని సిమ్రాత్స్ ధాబా, బాల్ కిషన్ మిల్క్ భాండార్ లలో ఆహార భద్రత లోపించిందని, ట్రేడ్ లైసెన్స్‌లు లేకుండానే స్టాల్స్ ను నిర్వహిస్తున్నారని తెలిపారు.
బాల్ కిషన్ మిల్క్ భాండార్ లో మలాయ్, పాలు వంటి పాల ఉత్పత్తులపై ఈగలు తిరుగుతున్నాయని గుర్తించారు. సరిగ్గా తేదీ లేబుల్ లేకుండా ప్యాక్ చేసిన లూజ్ పాలను కూడా అధికారులు గుర్తించారు. సిమ్రత్ ధాబాలో మూత లేని డస్ట్‌బిన్‌లు, మురికిగా ఉన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లను అధికారులు గుర్తించారు. దాబా ఆవరణలో కీటకాలను నిరోధించే తెరలు అమర్చబడలేదు, తలుపులు వదులుగా ఉన్నాయి. హెయిర్‌నెట్‌లు, గ్లౌజులు, ఆప్రాన్‌లు లేకుండా పని చేస్తున్నారని అధికారులు గుర్తించారు. జోధ్‌పూర్ మిఠాయ్ ఘర్ దుకాణంలో తేదీ లేబుల్ లేకుండా స్వీట్లలను ప్రదర్శిస్తున్నట్లు కనుగొన్నారు. దుకాణం అవసరమైన FSSAI లైసెన్స్‌ను ప్రదర్శించినప్పటికీ, నిల్వ చేసిన ఆహారాన్ని సరిగ్గా కవర్ చేయలేదని తేలింది. ఫుడ్ హ్యాండ్లర్లు ఎలాంటి సేఫ్టీ హెయిర్‌నెట్‌లు, అప్రాన్‌లను ధరించలేదు.