తిరుగుప్రయాణం.. హైవేపై ట్రాఫిక్ జాం
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి;
విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఓటు వేయడానికి వెళ్లిన వారంతా తిరుగు ప్రయాణం కావడంతో ఒక్కసారిగా హైవేపై రద్దీ పెరిగింది. వరసగా మూడు రోజులు సెలవులు రావడంతో ఓటు వేయడానికి శుక్రవారం నుంచి ఆదివారం వరకూ లక్షల సంఖ్యలో ప్రజలు ఆంధ్రప్రదేశ్ కు బయలుదేరి వెళ్లారు. ఆర్టీసీ, రైళ్లు, ప్రయివేటు బస్సుల్లో టిక్కెట్లు దొరకని వాళ్లు సొంత వాహనాలతో ఓటు హక్కును వినియోగించుకోవడానికి బయలుదేరి వెళ్లారు.
ఏపీలో ఓటు వేసి...
కొందరు నిన్న ఉదయాన్నే ఓటు వేసి తిరిగి ప్రయాణం కాగా, మరికొందరు ఈరోజు ఉదయం బయలుదేరారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద కూడా రద్దీ కనిపిస్తుంది. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వచ్చేందుకు వీలుగా టోల్ ప్లాజాల వద్ద గేట్లు అధిక సంఖ్యలో తెరుస్తున్నారు. ఉదయం ఆరు గంటల నుంచే హైవేపై ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఈరోజు, రేపు కూడా ఈరద్దీ ఇలాగే కొనసాగే అవకాశముంది.