అండర్ వేర్ లో కోట్ల విలువైన బంగారం
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు
శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. భారీగా అక్రమ బంగారాన్ని తరలిస్తూ ఉండగా అధికారులు పట్టుకున్నారు. అండర్‌వేర్‌లో కూడా బంగారం తరలిస్తుండగా.. ఆ ముఠాను అధికారులు పట్టేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు రూ. 2.279 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 1.37 కోట్లు.
కస్టమ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కువైట్, షార్జా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులు లోదుస్తుల్లో దాచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నారు. వారి నుంచి మొత్తం 1083 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకో ఘటనలో విమానంలో ప్రయాణీకుల సీటు వెనుక 1196 గ్రాముల బంగారాన్ని ఉంచారని కనుగొన్నారు.. కొంతమంది ప్రయాణీకులు పట్టుబడతారేమోననే భయంతో బంగారాన్ని విడిచిపెట్టినట్లు భావిస్తూ ఉన్నారు.
మరో కేసులో దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న 1,01,000 విదేశీ సిగరెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కంబోడియా నుంచి బ్యాంకాక్ మీదుగా వచ్చిన ముగ్గురు ప్రయాణికులు సిగరెట్లను అక్రమంగా భారతదేశంలోకి తరలించేందుకు ప్రయత్నించారు. ఈ ముగ్గురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు.