Hydra : హైడ్రా బుల్‌డోజర్ రేపు పయనమెటో? రూట్ మాప్ అదేనా?

హైడ్రా అంటేనే నగరంలో దడ మొదలయింది. సంపన్నుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకూ భయపడిపోతున్నారు.

Update: 2024-08-30 06:31 GMT

హైడ్రా అంటేనే నగరంలో దడ మొదలయింది. సంపన్నుల నుంచి మధ్యతరగతి ప్రజల వరకూ భయపడిపోతున్నారు. హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలను ఆపడం లేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట కూల్చివేతలను జరుపుతూనే ఉంది. కొందరికి నోటీసులు ఇచ్చి హైడ్రా కూల్చి వేతలు జరుపుతుండగా, మరికొందరికి మాత్రం నోటీసులు ఇవ్వకుండానే అక్రమ నిర్మాణమని తేలితే చాలు కూల్చివేయడం మొదలుపెట్టేస్తుంది. శని, ఆదివారాలు హైడ్రా బుల్‌డోజర్లు ఉదయాన్నే బయలుదేరి కూల్చివేతలను ప్రారంభించనున్నాయి. గత కొన్ని రోజులుగా ఇదే జరుగుతుంది. దీంతో శనివారం అంటేనే నగర వాసులు భయపడిపోతున్నారు.

ఎవరినీ వదలకుండా...
హైడ్రా అధికారులు ఎవరినీ వదలడం లేదు. చివరకు ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి కూడా నోటీసులు అంటించారు. 30 రోజుల్లో కూల్చేవేయాలని ఆదేశించారు. చెరువులు, నాలాలను ఆక్రమించి నిర్మించిన కట్టడాలను మాత్రమే తొలగిస్తున్నారు. దీంతో కొందరు ముందస్తుగా న్యాయస్థానానికి వెళ్లి స్టే ఆర్డర్స్ తెచ్చుకుంటున్నారు. దీంతో శని, ఆదివారాలు కోర్టులకు సెలవు దినాలు కావడంతో ఆరోజు హైడ్రా బుల్ డోజర్ వేగంగా పనిచేస్తుంది. అన్ని శాఖ అధికారులు సమన్వయంతో ఈ కూల్చివేతల కార్యక్రమాన్ని చేపట్టారు. బుల్ డోజర్ బయలుదేరే వరకూ ఇతర శాఖల అధికారులకు గాని, సిబ్బందికి గాని సమాచారం తెలియనివ్వకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఆక్రమణదారులకు...
సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ తో పాటు పెద్దోళ్ల నిర్మాణలను కూల్చివేశారు. దీంతో ఎవరినీ వదలబోమన్న సంకేతాలను హైడ్రా కమిషనర్ రంగనాధ్ బలంగా ఇచ్చారు. అయితే ఈ శనివారం హైడ్రా బుల్‌డోజర్ ఎటు బయలుదేరుతుందోనన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఇప్పటికే నోటీసులు ఇచ్చిన వారితో పాటు ఆక్రమించి భవనాలను నిర్మించుకున్న వారి గుండెల్లో బుల్‌డోజర్ పరుగులు తీస్తుంది. హైడ్రాకు ఫిర్యాదులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వాటిని పరిశీలించి ఆక్రమణలను అని నిర్ధారించుకున్న తర్వాతనే కూల్చివేత ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా హైడ్రా తీసుకుంటున్న చర్యలు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
43 ఎకరాలను...
గత నెల రోజుల్లో హైడ్రా అనేక నిర్మాణాలను కూల్చివేసింది. దాదాపు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే. రెవెన్యూ, హెచ్‌ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారుల అవినీతి కారణంగా కొన్ని దశాబ్బాల నుంచి ఇష్టమొచ్చినట్లు ఆక్రమణలకు గురి చేశారు. నాలాలు మూసుకుపోయాయి. చెరువులు మాయమయ్యాయి. దీంతో వర్షం పడితే చాలు హైదరాబాద్ భయంకరంగా మారిపోతుంది. రోడ్ల మీదనే నీరు నిలిచిపోతుంది. అందుకే ప్రభుత్వం హైడ్రాను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి అనేక అడ్డంకులు ఎదురవుతున్నప్పటికీ ప్రజల నుంచి మద్దతు వస్తుండటంతో వాటికి బ్రేకులు పడటం లేదు. మరి శనివారం హైడ్రా బుల్‌డోజర్ పయనమెటో?


Tags:    

Similar News