Hyderabad : హైదరాబాద్ లో ఫ్లాట్ల ధరలు తగ్గాయా? అందులో నిజమెంత?

హైదరాబాద్ లో ఇటీవల కాలంలో ఫ్లాట్ల ధరలు భారీగా తగ్గినట్లు పెద్దయెత్తు ప్రచారం జరుగుతుంది

Update: 2024-12-15 12:32 GMT

హైదరాబాద్ లో ఇటీవల కాలంలో ఫ్లాట్ల ధరలు భారీగా తగ్గినట్లు పెద్దయెత్తు ప్రచారం జరుగుతుంది. అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారుల కథనం ప్రకారం ఇటీవల కాలంలో ఫ్లాట్ల ధరలు పెరగలేదు కానీ.. అదే సమయంలో తగ్గలేదని చెబుతున్నారు. అంటే ధరలు నిలకడగానే ఉన్నాయని ధరలను తగ్గించి అమ్మకాలు చేస్తే తమకు నష్టం వస్తుందని చెబుతున్నారు. నిజానికి రిజిస్ట్రేషన్లు తగ్గడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పడిపోయిందని అందరూ భావించారు. కానీ దేశమంతా రియల్ వ్యాపారం ఇబ్బందుల్లో ఉందని చెబుతున్నారు. అందువల్లనే కొంత కాలం ఈ ధరలు పెరగకుండా నిలకడగానే ఉంటాయని, కానీ కొత్త ఏడాదిలో ధరలు మళ్లీ పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Full View

ప్రధానకారణం...
హైదరాబాద్ లో ఫ్లాట్ల కొనుగోళ్లు తగ్గడానికి ప్రధాన కారణం ఎక్కువ వెంచర్లు ఉండటమూ ఒక కారణమని చెబుతున్నారు. దీంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు కొన్ని ముందుగానే ప్రీ లాంచ్ పేరుతో వసూలు చేసి పలాయనం చిత్తగించడంతో ఫ్లాట్ల పై పెట్టుబడి పెట్టేందుకు ప్రజలు ఒకింత వెనకడుగు వేస్తున్నారన్నఅభిప్రాయం కూడా ఉంది. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ప్రజలకు టోకరా పెట్టడంతో పోలీస్ కేసులు నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు చిట్ సంస్థలుగా మారిపోయాయన్న కథనాలు వినిపిస్తున్నాయి పోలీసులు కూడా వాటిపై ఛీటింగ్ కేసు నమోదు చేస్తుండటంతో ప్రీలాంచ్ పేరుతో మోస పోయేకన్నా రెడీ టూ ఆక్యుపై గా ఉన్న ఫ్లాట్లను మాత్రమే కొనుగోలు చేస్తారని, వాటిని వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని అన్నారు.
ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నా...
రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఒక్కసారి పెట్టుబడులు పెట్టలేక ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో వసూలు చేస్తున్నారు. భూమిని కొనుగోలు చేసే దగ్గర నుంచి అపార్ట్ మెంట్ల నిర్మాణానికి కోట్ల రూపాయల నిధులు అవసరం కావడంతో పాటు, వడ్డీకితెచ్చి నష్టపోయే కన్నా, కొనుగోలుదారుల నుంచి అడ్వాన్స్ రూపంలోఎక్కువ మంది వద్ద సేకరించడం ఎప్పటి నుంచో జరుగుతుంది. ముందుగా అడ్వాన్స్ బుక్ చేసుకుని కొంతమొత్తం చెల్లిస్తే ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటించి ఆకట్టుకునే ప్రయత్నంచేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలను కొంత మంది బిల్డర్లు తమ వ్యవహారశైలి ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. మోసాలు పెరగడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ముందుగా చెల్లించడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అనేక వెంచర్లు మధ్యలోనే నిలిచిపోయాయి. మొత్తం మీద హైదరాబాద్ నగరంలో రియల్ వ్యాపారం మాత్రం పడిపోలేదని, అలాగని పెరగలేదని, నిలకడగా ఉందని రియల్ వ్యాపారులు చెబుతున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now

Tags:    

Similar News