Cold Winds : గజగజ వణికిపోతున్నారు.. చలిగాలులు చంపేస్తున్నాయ్
చలిగాలుల తీవ్రత పెరిగింది. మరి కొద్ది రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు
చలిగాలుల తీవ్రత పెరిగింది. మరి కొద్ది రోజుల పాటు చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అనేక చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానుండటంతో ప్రజలు బయటకు రావడానికే భయపడిపోతున్నారు. ఉదయం పది గంటల వరకూ సూర్యుడి జాడ లేకపోవడంతో జనం వణుకుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
వైద్యుల హెచ్చరిక....
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం మరింత చలి పెరిగింది. దీంతో శ్వాస కోశ వ్యాధులు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారు చలిలో బయటకు రావద్దని వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ప్రధానంగా ఉదయం ఐదు నుంచి పది గంటల వరకూ బయటకు రాకపోవడమే మంచిదన్న సూచనలు చేస్తున్నారు.
కనిష్ట ఉష్ణోగ్రతలు...
ప్రధానంగా రెండు తెలుగు రాష్టాల్లో చలి గాలులు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్ నగరంతో పాటు ఏజెన్సీ ఏరియాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రహదారులపై అలుముకున్న పొగమంచు కారణంగా వాహనాల ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. మినుములూరులో అతి తక్కువగా 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. పాడేరులో పదకొండు సెంటీ గ్రేడ్లు, ఆదిలాబాద్ జిల్లాలో 10.8 డిగ్రీలు, కొమురం భీం జిల్లాలో 9.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.