Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు జనసంద్రంగా మారిన ట్యాంక్‌బండ్
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయింది. పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణపతి అమ్మఒడిలో కలసి పోయారు.
ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జనం పూర్తయింది. పదకొండు రోజుల పాటు పూజలందుకున్న గణపతి అమ్మఒడిలో కలసి పోయారు. గంగమ్మ ఒడికి చేరిపోయారు. లక్షలాది మంది భక్తుల నినాదాల మధ్య ఖైరతాబాద్ గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం పూర్తి చేశారు. ఈసారి ఖైరతాబాద్ గణేశుడిని ఏర్పాటు చేి 70 ఏళ్లు కావడంతో 70 అడుగుల గణపతి విగ్రహాన్ని రూపొందించారు. సప్తముఖాలతో ఆయన భక్తులకు ఇన్ని రోజులు దర్శనమిచ్చారు. ఏటా జరిగే దాని కంటే ఈసారి అత్యంత వైభవంగా ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవాలు జరిగాయి. ఉదయం 6.30 గంటలకు ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన మహాగణపతి మధ్యాహ్నం 1గంటకు చేరుకున్నారు.
ప్రత్యేక పూజలు...
అనంతరం గణపతికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. మహా నైవేద్యం సమర్పించి తర్వాత మంగళహారతులతో బడా గణేశుడికి ఘనంగా వీడ్కోలు పలికింది. ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ గణపతి బప్పా మోరియా, జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై అంటూ నినాదాలు మారుమోగిపోయాయి. ట్యాంక్‌బండ్ పరిసరప్రాంత మంతా జనసంద్రంగా మారింది. అపురూపమైన దృశ్యాన్ని వీక్షించడానికి జంటనగరాల్లో నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చారు. లక్షలాది మంది భక్తుల నినాదాల మధ్య మహాశక్తి గణపతి నిమజ్జనం అయ్యారు. ట్యాంక్ బండ్ వద్ద ఉన్న నాల్గవ క్రేన్ వద్ద ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది.
సెలవు కావడంతో...
ఈరోజు ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో ఎక్కువ మంది ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జనసునామీతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ నిండిపోయాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటుచేసింది. మెట్రో రైళ్ల వేళలను కూడా అర్థరాత్రి రెండు గంటల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ట్యాంక్ బండ్ పై అన్న దాన కార్యక్రమాలు కూడా నిరంతరంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం త్వరగా పూర్తయితే వెనువెంటనే మిగిలిన విగ్రహాల నిమజ్జనాలను ఈ రాత్రికి ముగించాలని పోలీసు శాఖ నిర్ణయించింది. అంతా అనుకున్న సమయానికే పోలీసు ఉన్నతాధికారుల రూపొందించిన మార్గదర్శకాల మేరకే నిమజ్జనాలు సాగుతున్నాయి. మొత్తం మీద ఖైరతాబాద్ గణేశుడికి లక్షలాది మంది భక్తులు మనసు భారంగా వీడ్కోలు పలికారు.