Sankranthi : ఇవేమి రేట్లు రా బాబూ.. సంక్రాంతి పండగ ఇక్కడే కనపడుతుందిగా?
సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు.;
సంక్రాంతి పండగ కోసం హైదరాబాద్ నగరం నుంచి లక్షలాది మంది ప్రజలు సొంతూళ్లకు బయలుదేరారు. నిన్నటి నుంచి రైళ్లు, బస్సులు, విమానాలు, సొంత కార్లు ఇలా ఎవరికి తోచిన విధంగా.. ఎవరికి అందుబాటులో ఉన్న వెసులుబాటుతో ప్రయాణమయ్యారు. ఇక జాతీయ రహదారిపై నేడు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. నిన్న ఒక్కరోజే విజయవాడ వైపు జాతీయ రహదారిపై యాభై వేల వాహనాలు వెళ్లాయని చెబుతున్నారు. ఈరోజు కూడా అదే స్థాయిలో రద్దీ ఉంటుందని భావించిన టోల్ ప్లాజా నిర్వాహకులు విజయవాడ వైపు వెళ్లే దారిలో పది గేట్లను ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్ సౌకర్యం ఉన్నప్పటికీ టోల్ ప్లాజాలవద్ద ఆలస్యమవుతుంది.
ప్రయివేటు బస్సుల యాజమాన్యం
ఇక ప్రయివేటు బస్సుల యాజమాన్యం ముక్కుపిండి వసూలు చేస్తుంది. ఆర్టీసీ అధికారులు అదనపు ఛార్జీల పేరిట యాభై శాతం ధరలను పెంచి వసూలు చేస్తుండగా, ప్రయివేటు బస్సు యజమానులు ఒక అడుగు ముందుకేసి ఎనభై శాతం వరకూ ఛార్జీలను పెంచారు. సాధారణంగా విజయవాడకు మామూలు రోజుల్లో వెయ్యి రూపాయల టిక్కెట్ ఉంది. ఇప్పుడు విజయవాడకు రెండు నుంచి మూడు వేల రూపాయలు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. విశాఖకు అయితే ఆరు వేల రూపాయలు వరకూ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. విజయవాడ నుంచి విశాఖకు వెళ్లేందుకు కూడా నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు లబోదిబో మంటున్నారు. ఇలా ప్రయివేటు బస్సుల యాజమాన్యం దోపిడీకి తెరతీసినా ఆర్టీఏ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలున్నాయి.
విమాన ఛార్జీలు కూడా...
దీంతోపాటు విమాన ఛార్జీలు కూడా భారీగా పెరిగాయి. సంక్రాంతి పండుగ కోసం ప్రజలంతా పెద్ద ఎత్తున సొంతూళ్లకు వెళ్లేందుకు కొందరు విమానాల ద్వారా వెళుతున్నారు. ముందుగా బుక్ చేసుకోకుండా అప్పటికప్పడు బుక్ చేసుకుంటే విమాన ఛార్జీలు కూడా తడిసి మోపెడవుతున్నాయి. రైళ్లు, బస్సు టిక్కెట్లు ముందుగానే బుక్ అయిపోవడంతో విమానాలను కొందరు ఆశ్రయిస్తున్నారు. మామూలు రోజుల్లో హైదరాబాద్, బెంగళూరు టికెట్ ధర మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయల వరకు ఉంటుంది. కానీ ఇప్పుడు టికెట్ ధర 18 వేలకుు పెరిగింది. అయినా సంక్రాంతికి వెళ్లాలని భావించేవారు విమానంలోనైనా వెళ్లి పండగను జరపుకునేందుకు సిద్ధమయ్యారు.