సినీ కుటుంబంలో...
అంతవరకూ ఓకే కానీ దిల్ రాజు ఇలా ఉన్నట్లుండి సీన్ లోకి రావడానికి కారణాలపైనే చర్చ జరుగుతుంది. అల్లు అర్జున్ బెయిల్ పై నుంచి విడుదలయిన తర్వాత ఇంటికి వెళ్లి పరామర్శించిన వారిలో దిల్ రాజు ఒకరు. కానీ బాలుడు శ్రీతేజ్ నుమాత్రం పరామర్శించలేదు. అయితే అల్లు అర్జున్ వివాదం రోజురోజుకూ ముదిరిపోవడంతో దిల్ రాజు రంగ ప్రవేశం చేసి ఈ వివాదానికి శుభం కార్డు వేయాలని భావిస్తున్నట్లే కనపడుతుంది. నిజానికి దిల్ రాజు సినిమాలే సంక్రాంతికి ఎక్కువగా విడుదలవుతున్నాయి. ఈ సమయంలో ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో నష్టపోయే తొలి నిర్మాత దిల్ రాజే అవుతారు. బెనిఫిట్ షోలు ఉండవు. ధరలను పెంచమన్న దానిపై పునరాలోచించుకోవాలని ముఖ్యమంత్రిని కలిసే అవకాశాలున్నాయి.
ఇద్దరూ వేర్వేరు కాదు...
దిల్ రాజు, అల్లు అరవింద్ వీరు వేర్వేరు కాదు. ఇద్దరూ ప్రముఖ నిర్మాతలే. వీరే ఎక్కువ సినిమా హాళ్లు కూడా కలిగి ఉన్నారని గతంలో అనేక మంది ఆరోపణలు కూడా చేశారు. ఒకరకంగా చెప్పాలంటే సినీ ఇండ్రస్ట్రీలో ఆ నలుగురు అని ప్రముఖంగా వినపడే వారిలో దిల్ రాజు, అల్లు అరవింద్ ఇద్దరూ ఉన్నారు. అల్లు కుటుంబంలో కష్టమొస్తే దిల్ రాజుకు వచ్చినట్లే. సంథ్యా థియేటర్ ఘటన దురదృష్టకరమని చెబుతూనే రాజీ కోసం రాజుగారు దిగినట్లు కనపడుతుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి పట్టుకుని ఈ ఘటనను లాగుతున్నారని భావించడం, మరోవైపు అల్లు అర్జున్ కూడా కొంత కష్టాల్లో పడటంతో దిల్ రాజు తో సయోధ్య కుదుర్చుకునేందుకు సిద్ధమయినట్లే కనపడుతుంది.
వివాదానికి ఫుల్ స్టాప్....
అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నేత అయినప్పటికీ ఆయనకు కాంగ్రెస్ పెద్దల నుంచి పెద్దగా అండ లభించలేదు. చివరకు పార్టీ వ్యవహారాల దీపాదాస్ మున్షీని కలవాలనుకున్నా సాధ్యం కాలేదు. మరోవైపు అల్లు అర్జున్ ను మరోసారి విచారణకు పిలిపించడం, అల్లు అర్జున్ ఇంటిపై కొందరు దాడి చేయడంతో పాటు మధ్యంతర బెయిల్ గడువు సమీపిస్తున్న తరుణంలో దిల్ రాజు ఎంట్రీ అల్లు అర్జున్ అభిమానులకు శుభవార్త తెచ్చిపెడుతుందంటున్నారు. మరో వైపు కాంగ్రెస్ నేతలు కూడా ఇకపై ఈ విషయాన్ని వదిలేయాలని, ఎవరూమాట్లాడవద్దని కూడా రేవంత్ రెడ్డి సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద కొత్త ఏడాది ప్రారంభం కాకముందే దిల్ రాజు ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడతారన్నది టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి ఏంజరుగుతుందో చూడాలి.