మంచు మోహన్ బాబు ఇంట్లో గొడవలు రోజురోజకూ పెరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు చేసుకోవడమే కాకుండా చివరకు దాడులకు కూడా దిగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో రాచకొండ పోలీసులు మోహన్ బాబు, ఆయన కుమారుడు విష్ణు ల గన్ లను సీజ్ చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా నేడు 10.30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆదేశించినట్లుతెలిసింది. జల్పల్లిలో మీడియా ప్రతినిధులపై దాడికి దిగిన మోహన్ బాబుపై కేసు నమోదుచేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు మోహన్ బాబు, మంచు విష్ణులిద్దరూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి గన్ లైసెన్సులను పొందారు. వాటిని సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని రాచకొండ పోలీసులు నిర్ణయించడం విశేషం.
ఆసుపత్రిలో చేరిన
అయితే నిన్న రాత్రి జరిగిన గొడవతో బీపీ పెరిగిపోయిన మోహన్ బాబు కిందపడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆయన గచ్చిబౌలిలోని కాంటినెంటెల్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. మోహన్ బాబుతో పాటు ఆయన భార్య కూడా అస్వస్థతకు గురి కావడంతో ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్చారు. దీంతో మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆయన ఈరోజు పోలీసుల విచారణకు హాజరు అవుతారా? లేదా? తెలియాల్సి ఉంది. మరోవైపు మోహన్ బాబు మంచు మనోజ్ ను ఉద్దేశించి ఆడియోను విడుదల చేశారు. ఆ ఆడియోలో మోహన్ బాబు మంచు మనోజ్ కు తాను అతడిని ఎంతగా ప్రేమించి పెద్దచేసిందీ తెలియచేశారు. మోహన్ బాబు వయసు 78 ఏళ్లు కావడంతో స్వల్ప ఆరోగ్య సమస్యలు తలెత్తాయని వైద్యులు తెలిపారు.
మోహన్ బాబు తాజా సందేశం...
"మనోజ్ నువ్వు నాబిడ్డవు. లక్ష్మీప్రసన్న, విష్ణువర్ధన్ బాబు, మనోజ్ కుమార్ ఎలా పెంచాను రా? అందరికంటేనిన్నే గారాబంగా పెంచానురా. నీకోసమే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాను. నువ్వు ఏది అడిగినా ఇచ్చాను. నువ్వు ఈరోజు నా గుండెల మీద తన్నావ్. నా మనసు ఆవేదనతో కుంగిపోతుంది. నా బిడ్డ నా తకలేదు. కొన్నికారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం. ప్రతి కుటుంబంలో ఘర్షణలు ఉంటాయి. ఈ ఇల్లు నా కష్టార్జితం. నీకు సంబంధంలేదు. తాగుడుకు అలవాటు పడి నీ భార్య విని పనివారిపై దాడులకు దిగితే ఎలా? నా పరువుప్రతిష్టలు మంట గలిపావు. నన్ను ఎవరూ మోసగాడు అనలేదు.నీకు జన్మనివ్వడమే నా పాపమా? ఆస్తులు ముగ్గురికీ రాయాలా? వద్దా? అన్నది నా ఇష్టం. ఇస్తానా? లేదా? దాన ధర్మాలు చేస్తానా? అనేది నా ఇష్టం. ఇప్పటికైనా మారరా. మనోజ్ వచ్చి నీ బిడ్డను నువ్వు తీసుకెళ్లవచ్చు. లేకపోతే నీబిడ్డను నేనే జాగ్రత్తగా పెంచుతా" అంటూ మోహన్ బాబు మనోజ్ కు సందేశం పంపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App Now