Telangana : బాలయ్యకు ఝలక్ ఇచ్చిన రేవంత్.. సొంత పార్టీ నేతలకూ
రేవంత్ రెడ్డి సర్కార్ బాలయ్య బాబుకు షాక్ ఇవ్వనుంది. తనపై వచ్చే విమర్శలకు రేవంత్ చెక్ పెట్టనున్నారు
రేవంత్ రెడ్డి సర్కార్ బాలయ్య బాబుకు షాక్ ఇవ్వనుంది. తనపై వచ్చే విమర్శలకు రేవంత్ చెక్ పెట్టనున్నారు. జూబ్లీహిల్స్ లోని హిందూపురం ఎమ్మెల్యే, సినీహీరో బాల కృష్ణ నివాసం సగ భాగాన్ని అధికారులు తమ పరం చేసుకోదలిచారు. ఈ మేరకు మార్కింగ్ కు కూడా వేశారు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు విస్తరణ పనుల్లో భాగంగా అనేక మంది ప్రముఖుల నివాసాలు తమ భూమిని కోల్పోనున్నారు. మహారాజ అగ్రసేన కూడలి నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వరకూ ఉన్న ప్రధానభవనాలకు సంబంధించి మార్కింగ్ పూర్తయింది. తమ నివాసం భూమిని కోల్పోయే వారిలో మాజీ మంత్రి జానారెడ్డి, అల్లు అర్జున్ మామ కె. చంద్రశేఖర్ రెడ్డితో పాటు రెండు మీడియాసంస్థలకు చెందిన భవనాలున్నాయి. అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా తమ భూమిని కోల్పోనున్నారు.
ఆరు రోడ్డ నిర్మాణానికి...
కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు రోడ్ల కూడలిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేబీఆర్ పార్క్ విస్తరణకు రేవంత్ రెడ్డి మంత్రి వర్గం విస్తరణకు పూనుకుంది. అందులో భాగంగా నందమూరి బాలకృష్ణతో పాటు అనేక మంది ప్రముఖుల నివాసాలు, భవనాలకు సంబంధించి మార్కింగ్ వేశారు. అయితే వారిని ఒప్పించి భవిష్యత్ ప్రయోజనాలను, నగర అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరనన్నారు. వారిని ఒప్పించి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే వీరిలో ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే దానికి సంబంధించి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.
ఫ్లై ఓవర్ల నిర్మాణానికి...
ఈ విస్తరణలో భాగంగా బాలకృష్ణ నివాస భవనం స్థలంలో సగం కోల్పోయే అవకాశముందని తెలిసింది. అలాగే జానారెడ్డికి చెందిన భవనానికి సంబంధించి 700 గజాల స్థలాన్ని కోల్పోయే అవకాశం ఏర్పడింది. దీంతో పాటు కేబీఆర్ పార్క్ వద్ద చుట్టూ ప్రభుత్వం ఫ్లై ఓవర్ల నిర్మాణం చేపట్టనుంది. పర్యావరణ వేత్తలకు సంబంధించి అభ్యంతరం రాకుండా ఫ్లైఓవర్ల నిర్మాణం చేస్తే ట్రాఫిక్ ను చాలా వరకూ అరికట్టవచ్చని భావిస్తుంది. దీంతో ప్రముఖుల నివాస భవనాల స్థల సేకరణ అనివార్యమయింది. అందులో భాగంగానే బాలకృష్ణతో పాటు జానారెడ్డి ఇతర ప్రముఖుల సంస్థలకు చెందిన స్థలం కూడా కోల్పోయే అవకాశముంది. అధికారులయితే మార్కులు వేశారు కానీ, పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయన్నది చూడాలి.