అసలే స్పోర్ట్స్ బైక్.. ఆపై గచ్చిబౌలి ఫ్లైఓవర్
ఇతర వాహనాలలో ప్రయాణించే వాళ్లకు కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ బైక్స్ పై కాస్త దృష్టి పెట్టాలని ప్రజలు ట్రాఫిక్ పోలీసులను కోరుతూ ఉన్నారు.
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై ఓ స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుడిని గచ్చిబౌలికి చెందిన మధు (25)గా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాత్రి వేళ ఇద్దరు యువకులు వేగంగా బైక్ పై ప్రయాణిస్తూ డివైడర్‌ను ఢీకొట్టారు. ఒక ఫ్లైఓవర్ నుంచి మరో ఫ్లైవర్‌పై ఎగిరిపడ్డారు. ప్రమాద తీవ్రతకు మధు అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మధు గచ్చిబౌలిలో నివసిస్తుంటాడని పోలీసులు తెలిపారు. స్పోర్ట్స్ బైక్ లపై ప్రమాదకర స్టంట్స్ చేసే యువకులను మనం హైదరాబాద్ నగరంలో చూస్తూ ఉంటాం. కొందరి కారణంగా ఇతర వాహనాలలో ప్రయాణించే వాళ్లకు కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఈ స్పోర్ట్స్ బైక్స్ పై కాస్త దృష్టి పెట్టాలని ప్రజలు ట్రాఫిక్ పోలీసులను కోరుతూ ఉన్నారు.