Hydra : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం...హైడ్రా కూల్చివేతలకు బ్రేక్?

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ పడింది

Update: 2024-10-07 06:09 GMT

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రా కూల్చివేతలకు బ్రేక్ పడింది. ఆక్రమణల తొలగింపునకు హైడ్రా విరామం ప్రకటించినట్లు సమాచారం. ఇందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల హైకోర్టు హైదరాబాద్ పరిధిలో కూల్చివేతలపై హైడ్రా అధికారులను నేరుగా ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఎఫ్‌టీఎల్ పరిధిని నిర్ధారించారా? అని అడిగింది. దీనికి హైడ్రా అధికారుల వద్ద సమాధానం లభించలేదు. ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిని నిర్ధారించకపోవడం రానున్న కాలంలో అడ్డంకిగా మారనుందని భావించిన ప్రభుత్వం ముందు చెరువుల ఎఫ్‌టీఎస్ విస్తీర్ణం పరిధిని నిర్ధారించాలని నిర్ణయించింది.

సమగ్ర సర్వేకు....
ఇందుకోసం సమగ్ర సర్వేకు రేవంత్ సర్కార్ ఆదేశించింది. హెచ్ఎండీఏ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిపై సమగ్ర సర్వేను చేయాలని నిర్ణయించింది. ఇరిగేషన్ శాఖ, రెవెన్యూశాఖ అధికారులను ఆదేశించారు. సర్వే నివేదికను మూడు నెలల్లో పూర్తిచేయాలని కూడా టైం బౌండ్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక వచ్చిన తర్వాత ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ వివరాలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక వెబ్‌సైట్ లో ఉంచాలని కూడా నిర్ణయించింది. లేకుంటే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలను ప్రారంభించింది. అప్పటి వరకూ హైడ్రా కూల్చివేతలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 
హైకోర్టు తప్పుపట్టడంతో్....
ఇటీవల హైకోర్టు తప్పుపట్టడంతో్ పాటు అనేక మంది తమ నిర్మాణాలు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ లలో లేవంటూ వాదనలు మొదలు పెట్టడం కూడా ప్రభుత్వానికి తలనొప్పిగా తయరయింది. వారికి న్యాయస్థానాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటీవల హైడ్రా కమిషనర్ రంగనాధ్ ను కూడా ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిని నిర్ధారించారా? అని ప్రశ్నించడంతో ఆయన సరైన సమాధానం న్యాయస్థానానికి చెప్పలేక నీళ్లు నమిలారు. దీంతో పూర్తిగా చట్టబద్దతతో కూల్చివేతలకు ముందుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల ఆక్రమణదారులకు న్యాయస్థానాలు స్టే ఉత్తర్వులు ఇవ్వకుండా ఉపయోగపడుతుందని అభిప్రాయపడి ఈ నిర్ణయం తీసుకుంది.


Tags:    

Similar News