Numaish 2024: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఈ 45 రోజులూ ఆంక్షలు
హైదరాబాద్ నగరంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నేటి నుంచి
హైదరాబాద్ నగరంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) నేటి నుంచి ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే నుమాయిష్‌ను సీఎం రేవంత్‌రెడ్డి, సొసైటీ అధ్యక్షుడు, మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ప్రారంభిస్తారు. జనవరి 1వ తేది నుంచి ఫిబ్రవరి 15వ తేది వరకు 46 రోజుల పాటు నుమాయిష్ కొనసాగుతుంది. నుమాయిష్ దృష్ట్యా నేటి నుంచి ఫిబ్రవరి 15 వరకు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. బషీర్‌బాగ్, పోలీస్ కంట్రోల్‌రూమ్ వైపు నుంచి వెళ్లే భారీ, ఆర్టీసీ బస్సులను ఎల్బీస్టేడియం మీదుగా బీజేఆర్ విగ్రహం నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. బేగంబజార్ ఛత్రి, మాలకుంట ప్రాంతాల నుంచి నాంపల్లి వైపు వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలను దారుసలాం జంక్షన్ నుంచి ఏక్‌మినార్ వైపు మళ్లిస్తారు. బహదూర్‌పురా పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజ్ మీదుగా నయాపూల్ వైపు మళ్లిస్తారు. మూసాబౌలి/బహదూర్‌పుర వైపు నుంచి నాంపల్లి వైపు వెళ్లాలనుకునే ఆర్టీసీ బస్సులతో సహా ఇతర వాహనాలు సిటీ కళాశాల వద్ద నయాపూల్, ఎంజేమార్కెట్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. రాబోయే 45 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.