ఆస్ట్రేలియాలో దారుణం.. భారతీయ విద్యార్థిపై ఇనుప రాడ్లతో దాడి
ఉగ్ర మూకల కార్యకలాపాలను వ్యతిరేకించినందుకు ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దతుదారులు 23 ఏళ్ల భారతీయ విద్యార్థిని ఇనుప రాడ్లతో కొట్టారని
ఉగ్ర మూకల కార్యకలాపాలను వ్యతిరేకించినందుకు ఆస్ట్రేలియాలో ఖలిస్తాన్ మద్దతుదారులు 23 ఏళ్ల భారతీయ విద్యార్థిని ఇనుప రాడ్లతో కొట్టారని శుక్రవారం ఆస్ట్రేలియా మీడియా కథనం తెలిపింది. సిడ్నీలోని పశ్చిమ శివారు మెర్రీల్యాండ్స్‌లో “ఖలిస్తాన్ జిందాబాద్” అని నినాదాలు చేస్తూ దుండగులు విద్యార్థిపై దాడి చేశాడు. విద్యార్థి పనికి వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగిందని ది ఆస్ట్రేలియా టుడే న్యూస్ పోర్టల్ తెలిపింది. "ఈరోజు ఉదయం 5.30 గంటలకు నేను పనికి వెళుతున్నప్పుడు.. 4-5 మంది ఖలిస్తాన్ మద్దతుదారులు నాపై దాడి చేశారు" అని పేరు చెప్పడానికి ఇష్టపడని విద్యార్థి చెప్పాడు.
“నేను నా డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వెంటనే ఈ ఖలిస్తాన్ మద్దతుదారులు ఎక్కడి నుంచో వచ్చారు. వారిలో ఒకరు నా వాహనం యొక్క ఎడమ వైపు తలుపు తెరిచి, నా ఎడమ కన్ను కింద నా చెంప ఎముకపై ఇనుప రాడ్డుతో కొట్టారు” అని విద్యార్థి చెప్పాడు. ఆ తర్వాత తనను వాహనంలో నుంచి బయటకు లాగి ఇనుప రాడ్లతో కొట్టారని డ్రైవర్‌గా పనిచేస్తున్న విద్యార్థి చెప్పాడు. దాడిని ఇద్దరు దుండగులు వీడియో రికార్డ్ కూడా చేశారని విద్యార్థి తెలిపారు. "ఖలిస్థాన్ జిందాబాద్" అనే నినాదాన్ని వారు పదేపదే లేవనెత్తారు" అని అతను పేర్కొన్నాడు.
"అంతా 5 నిమిషాల్లోనే జరిగింది, ఖలిస్తాన్ సమస్యను వ్యతిరేకించినందుకు ఇది నాకు గుణపాఠం కావాలి అని చెప్పి వెళ్లిపోయారు. లేని పక్షంలో నాకు ఇలాంటి పాఠాలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాం అని చెప్పారని'' విద్యార్థి తెలిపాడు. ఈ సంఘటన గురించి న్యూ సౌత్ వేల్స్ (NSF) పోలీసులకు సమాచారం అందించారు. భారతీయ విద్యార్థి తల, కాలు మరియు చేతికి పెద్ద గాయాలు కావడంతో వెస్ట్‌మీడ్ ఆసుపత్రికి తరలించారు. "ఒక 23 ఏళ్ల వ్యక్తి రూపర్ట్ స్ట్రీట్ వెంబడి నడుస్తున్నట్లు పోలీసులకు చెప్పబడింది, అతనిపై నలుగురు వ్యక్తులు మెటల్ స్తంభంతో దాడి చేశారు" అని పోలీసు ప్రతినిధి తెలిపారు.
మెర్రీల్యాండ్స్ పార్లమెంటు సభ్యుడు మాట్లాడుతూ.. ''మా స్థానిక సమాజంలో ఎలాంటి తీవ్రవాదం లేదా హింసకు చోటు లేదు. ఈ సంఘటనకు సంబంధించి నేను సంబంధిత అధికారులను సంప్రదించాను'' అని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో మెల్‌బోర్న్‌లో ఖలిస్తానీ కార్యకర్తలు, భారత అనుకూల ప్రదర్శనకారుల మధ్య రెండు వేర్వేరు ఘర్షణలు జరిగాయి. ఖలిస్తానీ వేర్పాటువాదుల భారత వ్యతిరేక కార్యకలాపాలను, దేశంలోని హిందూ దేవాలయాలపై తరచూ దాడులను అరికట్టాలని ఆస్ట్రేలియా ప్రభుత్వాన్ని భారత్ కోరింది.