పన్ను చెల్లింపుదారుల్లో జీరో ట్యాక్స్‌ చెల్లించేవారు ఎంత మంది ఉన్నారో తెలుసా? ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కీలక నివేదిక

ఈ ఏడాది భారతదేశంలో 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. అత్యధిక ఐటీఆర్ ఫైల్స్ నమోదు అయిన రికార్డు ఇదే...

Update: 2023-08-08 05:49 GMT

ఈ ఏడాది భారతదేశంలో 6.77 కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. అత్యధిక ఐటీఆర్ ఫైల్స్ నమోదు అయిన రికార్డు ఇదే. ఆదాయపు పన్ను శాఖ లెక్కల ప్రకారం.. ఆదాయపు పన్ను జీరో ఉన్నవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. అంటే.. ప్రజలు తమ ఆదాయాన్ని రూ.5 లక్షలు లేదా అంతకంటే తక్కువగా చూపించి 'జీరో ట్యాక్స్' చెల్లించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి చివరి తేదీ 31 జూలై 2023 గడువు ముగిసిన విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రజలు దాని ఇ-ధృవీకరణ కోసం మరో 30 రోజుల సమయం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఐటీఆర్‌ను రూ. 5,000 వరకు పెనాల్టీ చెల్లించడం ద్వారా ఆలస్యంగా కూడా పూరించవచ్చు. ఈ ఆదాయపు పన్ను రిటర్న్‌ల డేటా నుంచి 'జీరో ట్యాక్స్‌' చెల్లించే పన్ను చెల్లింపుదారుల డేటా కూడా బయటకు వచ్చింది.

ఆదాయపు పన్ను వసూళ్లను పెంచేందుకు ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. పన్ను రిటర్న్‌లు దాఖలు చేసే వారి సంఖ్య కూడా పెరిగింది. అయితే ఈ ఏడాది దాఖలు చేసిన 6.77 కోట్ల ఐటీఆర్‌లలో దాదాపు 4.65 కోట్ల మంది జీరో ట్యాక్స్‌ దాఖలు చేశారు. అంటే, వారి ఆదాయం రూ. 5 లక్షలు లేదా అంతకంటే తక్కువ. ఇది మొత్తం పన్ను చెల్లింపుదారుల సంఖ్యలో సగం కంటే ఎక్కువ. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో జీరో ట్యాక్స్‌ చెల్లించిన పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 2.9 కోట్లు. ఆ నేపథ్యంలో దేశంలో 4 ఏళ్లలో ఐటీఆర్‌ దాఖలు చేసే వారి సంఖ్య పెరగగా, అదే సమయంలో జీరో ట్యాక్స్‌ చెల్లించే వారి సంఖ్య కూడా రెండింతలు పెరిగింది.

అయితే దీనికి మరొక కారణం మొదటిసారిగా ఆదాయపు పన్నును దాఖలు చేసే పన్ను చెల్లింపుదారులు కావచ్చు. వీరి ఆదాయం పన్ను పరిధిలోకి రాదు. ఆదాయపు పన్ను రిటర్న్‌ల ఈ గణాంకాలు తాత్కాలికమైనవి. పెద్ద సంఖ్యలో ఆదాయపు పన్ను రిటర్న్‌లు ఇంకా ప్రాసెస్ కాలేదు.

1 కోటి కంటే ఎక్కువ సంపాదిస్తున్న పన్ను చెల్లింపుదారులు:

దేశంలో 1 కోటి కంటే ఎక్కువ ఆదాయాన్ని చూపుతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య దాదాపు 1.69 లక్షలు అని ఆదాయపు పన్ను రిటర్న్ డేటా చూపుతోంది. రూ.5 నుంచి 10 లక్షలు ఆర్జించే పన్ను చెల్లింపుదారులు 1.10 కోట్ల మంది, రూ.10 నుంచి 20 లక్షలు ఆర్జించే వారు 45 లక్షల మంది, రూ. 20 నుంచి 50 లక్షలు ఆర్జించే వారు 19 లక్షలు, రూ.50 లక్షల నుంచి కోటి వరకు ఆదాయ పన్ను చెల్లింపుదారులు 3.3 లక్షల మంది ఉన్నారు.

Tags:    

Similar News