ట్విట్టర్ కు పోటీగా బ్లూ స్కై.. ఐఓఎస్ వెర్షన్ లో బీటా టెస్ట్
ట్విట్టర్ వ్యవస్థాపకుడైన జాక్ డోర్సే.. ఇప్పుడు దానికి పోటీగా మరో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు.
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ట్విట్టర్ పగ్గాలు ఎలాన్ మస్క్ చేతికి చిక్కినప్పటి నుండి అనూహ్య మార్పులు జరుగుతున్నాయి. తొలుత బ్లూ టిక్ వెరిఫికేషన్ మాత్రమే పెట్టిన ట్విట్టర్లో.. ఇప్పుడు మూడు రకాల టిక్ లను తీసుకొచ్చారు . అంతేకాక వెరిఫికేషన్ కు నెలవారీ ఛార్జీను కూడా పెంచాడు. దానికన్నా ముందు వేలమంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మస్క్.. తాజాగా మరికొంతమంది ఉన్నతస్థాయి ఉద్యోగుల్ని తీసేశాడు.
ట్విట్టర్ వ్యవస్థాపకుడైన (మాజీ సీఈఓ) జాక్ డోర్సే.. ఇప్పుడు దానికి పోటీగా మరో సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ను తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యాడు. దానిపేరే ‘బ్లూ స్కై’. బ్లూ స్కై యాప్ ను ఇప్పటికే యాపిల్ ఐవోఎస్ పై పరీక్షిస్తున్నారు. యాపిల్ యాప్ స్టోర్ లో బ్లూ స్కైని గుర్తించొచ్చు. గతేడాది ట్విట్టర్ లో తన వాటాలను టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు విక్రయించేసిన జాక్ డోర్సే.. బ్లూ స్కై అభివృద్ధిపై దృష్టి పెట్టారు. అయితే ట్విట్టర్ మాదిరిగానే దీనిని కూడా బ్లూ రంగులోనే తీసుకురానున్నారు. ఇది కూడా మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామే.
ప్రస్తుతం బ్లూ స్కై టెస్టింగ్ దశలో ఉంది. ఇది యాప్ స్టోర్ లో అందుబాటులో ఉన్నా.. ఇన్విటేషన్ ఉన్నవారే ఇన్ స్టాల్ చేసుకోగలుగుతారు. బీటా టెస్ట్ తర్వాత బ్లూ స్కై త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. ట్విట్టర్ యూజర్ ఇంటర్ ఫేస్ మాదిరిగానే బ్లూ స్కై ఉండనుంది. డీసెంట్రలైజ్డ్ సోషల్ మీడియా ప్రోటోకాల్ గా దీన్ని డిజైన్ చేశారు. ఈ యాప్ అందుబాటులోకి వస్తే.. ట్విట్టర్ కు నష్టం జరుగుతుందా ? చూడాలి.