ఒమిక్రాన్ గుప్పిట్లో అగ్రరాజ్యం.. వైద్య వ్యవస్థ కుప్పకూలనుందా ?

ఇప్పుడు ఒమిక్రాన్ అంతకుమించిన నరకాన్ని చూపిస్తోంది. 20 రోజుల క్రితమే అక్కడ తొలి ఒమిక్రాన్ కేసు నమోదవ్వగా.. గతవారంతో పోలిస్తే ఈ వారం 73 శాతం కేసులు అధికంగా నమోవుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి.

Update: 2021-12-21 05:15 GMT

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ఒమిక్రాన్ కన్ను ఇప్పుడు అమెరికాపై కూడా పడింది. కరోనా తన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రూపంలో యమపాశం విసురుతోంది. దీంతో అగ్రరాజ్యం మరోసారి వెంటలేటర్ పైకి వెళ్లనుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల సంఖ్యలో నమోదవుతున్న కొత్త కేసులు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఒక ఒమిక్రాన్, మరోపక్క కోవిడ్ కేసులతో అగ్రరాజ్యం వణికిపోతోంది. తాజాగా అక్కడ తొలి ఒమిక్రాన్ మరణం నమోదు కావడంతో.. అమెరికా పౌరులు భయాందోళనకు గురవుతున్నారు. టెక్సాస్ కు చెందిన 50 ఏళ్ల వ్యక్తి ఒమిక్రాన్ తో మరణించాడు. అయితే అతను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్లే మరణించినట్లు అధికారులు చెప్తున్నారు.

నిండుకున్న బెడ్లు..

ఇదిలా ఉండగా.. అమెరికాలోని ప్రధాన ఆస్పత్రుల్లోని బెడ్లన్నీ కోవిడ్, ఒమిక్రాన్ పేషెంట్లతోనే నిండిపోయినట్లు తెలుస్తోంది. కొత్తగా వైరస్ బారిన పడిన పేషెంట్లకు బెడ్లు ఏర్పాటు చేసేందుకు ఆస్పత్రులు సరిపోవడం లేదు. వైద్య సిబ్బందిపై కూడా కోవిడ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండటంతో అక్కడి వైద్య వ్యవస్థ కుప్పకూలే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే.. అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి.

వచ్చే 8 వారాలు జాగ్రత్తపడాలి

డెల్టా వేరియంట్ తో అమెరికాలోని పలుప్రాంతాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజులు గడిచే కొద్దీ శవాల దిబ్బలు పేరుకుపోగా.. వాటిని ఖననం చేసేందుకు స్మశాన వాటికలు సైతం సరిపోలేదంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవాల్సిందే. ఇప్పుడు ఒమిక్రాన్ అంతకుమించిన నరకాన్ని చూపిస్తోంది. 20 రోజుల క్రితమే అక్కడ తొలి ఒమిక్రాన్ కేసు నమోదవ్వగా.. గతవారంతో పోలిస్తే ఈ వారం 73 శాతం కేసులు అధికంగా నమోవుతున్నట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇప్పటికే 48 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ పాగా వేసిందంటే.. మొత్తం అమెరికాను ఒమిక్రాన్ తన గుప్పిట్లోకి తీసుకున్నట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ఒకటిన్నర నుంచి మూడ్రోజుల్లో రెట్టింపు కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసులు కూడా తీవ్రస్థాయిలో ఉన్నాయి. నిన్న ఒక్కరోజే అక్కడ లక్షన్నర కోవిడ్ కేసులు బయటపడగా.. గడిచిన రెండ్రోజుల్లో 18 లక్షల మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. వచ్చే 8 వారాల్లో అమెరికా పౌరులు కోవిడ్ జాగ్రత్త చర్యలు పాటించకపోతే.. కోట్ల సంఖ్యలో కేసులు.. లక్షల్లో మరణాలను చూడకతప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News