IPL 2024 : ఆ ముగ్గురూ మడతెట్టేశారు.. చెన్నైకు బ్యాక్ టు బ్యాక్ విక్టరీని అందించారు
చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ ఓడించింది. 63 పరుగుల భారీ తేడాతో ఓడించింది.
IPL 2024 :ఐపీఎల్ సీజన్ మొదలయిన తొలి మ్యాచ్ తోనే విక్టరీ కొట్టిన చెన్నై సూపర్ కింగ్స్ రెండో మ్యాచ్ ను కూడా అలవోకగా గెలిచింది. తొలి మ్యాచ్ లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ను ఓడించగా, నిన్న చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్ ఓడించింది. అలా ఇలా కాదు 63 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దీంతో ఐపీఎల్ లో చెన్నైకి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందాయి. అయితే ఈ విజయంలో ముగ్గురు ఆటగాళ్లను మెచ్చుకోకుండా ఉండలేం. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 206 పరుగులు చేసింది.
రఫ్ఫాడించిన రచిన్...
తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, రచన్ రవీంద్రలు గుజరాత్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. రచిన్ రవీంద్ర అయితే ఫోర్లు, సిక్సర్లతో మోత పుట్టించాడు. రచిన్ రవీంద్ర రఫ్ఫాడించాడు. అయితే 46 పరుగుల వద్ద అవుటయి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఆ తర్వాత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నిదానంగానే ఆడుతూ 46 పరుగులు చేశాడు. ఫోర్లు, సిక్సర్లతో స్కోర్ బోర్డును పరుగులు తీయించాడు. ఒక దశలో చెన్నై 250 పరుగులు చేస్తుందనిపించింది. అయితే రుతురాజ్ కూడా 46 పరుగుల వద్దనే అవుటయ్యాడు.
శివాలెత్తిన దూబే...
తర్వాత క్రీజులోకి వచ్చిన శివమ్ దూబే శివాలెత్తిపోయాడు. అందిన బాల్ ను అందినట్లు బాదేశాడు. ఫోర్లు, సిక్సర్లతో స్టేడియంలో మోత పుట్టించిన దుబే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో చెన్నై స్కోరు 206కు చేరింది. 207 లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ ఆదిలోనే తడబడింది. కెప్టెన్ గిల్ అవుటయ్యాడు. దూకుడు మీదున్న సాహ కూడా అవుట్ అయ్యాడు.ఇలా వరసగా తక్కువ పరుగులకే చాపచుట్టేయడంతో టైటాన్స్ కధ ముగిసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ తలో రెండు వికెట్లు తీసి టైటాన్స్ ను ఓటమి వైపునకు నెట్టేశారు.