IPL 2024 : సన్ రైజర్స్ మళ్లీ రైజ్ అయ్యారుగా... అంత స్కోరును ఊది పారేశారుగా
లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పెద్దగా శ్రమించకుండానే విజయం సాధించింది
ఐపీఎల్ లో మజా లేకుండా కూడా కొన్ని మ్యాచ్ లు జరుగుతాయి. అందులో పెద్దగా టెన్షన్ ఉండదు. ఎందుకంటే తక్కువ స్కోరు ప్రత్యర్థి జట్టు చేయడంతో అవతలి జట్టు సులువుగా స్కోరును అధిగమించేస్తుంది. అయితే ఇది సులువుగా లభించింది కాదు. ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టును తక్కువ స్కోరుకు కట్టడి చేయగలిగితే తర్వాత ఛేదనలో ఏ జట్టు అయినా టెన్షన్ లేకుండా ఆడగలుగుతుంది. అందుకే బ్యాటర్లు ఎంత ముఖ్యమో.. జట్టుకు బౌలర్లు కూడా అంతే బలం అని అనేక మ్యాచ్ లలో రుజువుయ్యాయి. రెండు బలాలు సమంగా ఉంటేనే ఏ జట్టు అయినా ఇంతటి కాంపిటీషన్ లో రాణించగలుగుతుంది.
47 నిమిషాల్లోనే...
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలినాళ్లలో కొంత తడబడినా తర్వాత తేరుకుని ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. నిన్న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు పెద్దగా శ్రమించకుండానే విజయం సాధించింది. పది ఓవర్లలోనే మ్యాచ్ ను ముగించింది. స్వల్ప స్కోరును అధిగమించడానికి పెద్దగా కష్టపడలేదు. ఎందుకంటే ఓపెనర్లు ఇద్దరే లక్నో సూపర్ జెయింట్స్ విధించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఈ మ్యాచ్ లో విశేషంగా చెప్పుకోవాలి. కేవలం 47 నిమిషాల్లోనే తమకు ఇచ్చిన పనిని ముగించారు. ఒక్క వికెట్ కోల్పోకుండా గెలవడంతో సన్ రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో మళ్లీ పైకి ఎగబాకింది.
తక్కువ స్కోరుకు...
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆపసోపాలు పడుతూ బ్యాటింగ్ మొదలు పెట్టింది. భువనేశ్వర్ కుమార్ తన తొలి స్పెల్ లోనే రెండు వికెట్లు లాగేసుకున్నాడు. ఇక రాహుల్ 29 పరుగులు, డీకాక్ రెండు, స్టాయినిస్ మూడు పరుగులు చేశాడు. కృనాల్ పాండే రనౌట్ అయ్యాడు. అయితే 24 పరుగులు చేశఆడు. తర్వాత పూరన్, బదోని కాస్త నిలకడగా ఆడుతూ స్కోరును ఆమాత్రమైనా చేయగలిగారు. పూరన్ 48 పరుగులు చేయగా, బదోని 55 పరుగులు చేశాడు. 20 ఓవర్లకు లక్నో సూపర్ జెయింట్స్ కేవలం 165 పరుగులు మాత్రమే చేసింది. అయితే తర్వాత బరిలోకి దిగిన సన్ రైజర్స్ జట్టు కేవలం 9.4 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని పూర్తి చేసింది. అభిషేక్ శర్మ 75 పరుగులు చేయగా, హెడ్ మళ్లీ చెలరేగి ఆడి 89 పరుగులు చేసి జట్టును గెలిపించారు.