Diamond Found: డైలీ లేబర్ ని వరించిన అదృష్టం.. 80 లక్షల వజ్రం దొరకడంతో!

గుంతలు తవ్వి ఇసుకను జల్లెడ పట్టే ఓ రోజు కూలీ

Update: 2024-07-26 03:03 GMT

మధ్యప్రదేశ్‌లోని పన్నాలో గుంతలు తవ్వి ఇసుకను జల్లెడ పట్టే ఓ రోజు కూలీ రాజు గోండ్ కు అదృష్టం వరించింది. దశాబ్ద కాలంగా అతడు వజ్రాల కోసం వెతుకుతూనే ఉన్నాడు.. అతడికి ఎట్టకేలకు అనుకున్నది దొరికింది. తన చేతుల్లోకి మెరుస్తున్న వస్తువును తీసుకోగలిగాడు. ఇది 19.22 క్యారెట్ల వజ్రం, ప్రభుత్వ వేలంలో దాదాపు రూ. 80 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ధర పలుకుతుందని నిపుణులు చెప్పారు.

నా చేతుల్లో పట్టుకున్నప్పుడు ఇది వజ్రమని నాకు తెలుసు.. ఈ రాయిని పొందడానికి ఎంతగానో పనిచేశానని రాజు తెలిపాడు. ఈ స్థాయికి చేరుకోవడానికి 10 సంవత్సరాలు పనిచేశానని వివరించాడు. ఈ వజ్రంతో నా పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు. నా పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ వహించడమే కాకుండా.. నా ఆర్థిక కష్టాలు తీరుతాయని ఆశిస్తున్నానన్నాడు. ముందుగా తాను చేసిన రూ. 5 లక్షల రుణాన్ని చెల్లిస్తానని, వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని తన కుటుంబ సభ్యులకు పంచాలని భావిస్తున్నానన్నాడు. మిగిలిన డబ్బుతో సొంత ఇంటిని నిర్మించుకోవాలని, కొంత వ్యవసాయ భూమిని కొనాలనుకుంటున్నట్లు తెలిపాడు. తర్వాత కూడా వజ్రాల కోసం వెతుకుతూనే ఉంటానని రాజు చెప్పాడు. ఉత్తర మధ్యప్రదేశ్‌లోని పన్నాలో శతాబ్దాలుగా వజ్రాల మైనింగ్‌ జరుగుతూ ఉంది. అయితే అనేక కారణాల వల్ల పన్నాలో వజ్రాల నిక్షేపాలు గణనీయంగా తగ్గాయి.


Tags:    

Similar News