అదే మేం చేసిన తప్పు.. ఇక సహించబోం.. : అర్జున్ కపూర్

హీరో అర్జున్ కపూర్ ఈ బాయ్ కాట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ మాట్లాడుతూ..

Update: 2022-08-18 06:21 GMT

బాలీవుడ్ సినిమాలను వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవలే విడుదలైన లాల్ సింగ్ చడ్డా సినిమాపై ఇది తీవ్ర ప్రభావమే చూపింది. అమీర్ ఖాన్ గతంలో దేశానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ఆయన సినిమాను బాయ్ కాట్ చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. లాల్ సింగ్ చడ్డాను సపోర్ట్ చేసిన హృతిక్ రోషన్ పై కూడా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. హృతిక్ విక్రమ్ వేద సినిమాను బాయ్ కాట్ చేస్తామని చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉండగా.. ఇక ఇటీవల తాప్సి లీడ్ రోల్ లో వచ్చిన శభాష్ మిథు సినిమాని కూడా బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు పెద్దఎత్తున ట్వీట్లు, పోస్టులు చేస్తున్నారు.

బాయ్ కాట్ బాలీవుడ్ ట్రెండ్ పై కొందరు బాలీవుడ్ నటులు స్పందించారు. తాజాగా హీరో అర్జున్ కపూర్ ఈ బాయ్ కాట్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అర్జున్ కపూర్ మాట్లాడుతూ.. "ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌పై ఇన్ని రోజులుగా మాట్లాడకుండా ఉండటమే మేము చేసిన తప్పు. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే దానిని అవకాశంగా తీసుకుని.. విషయాన్ని పెద్దరి చేస్తున్నారు. మన టాలెంట్‌ గురించి మన సినిమా మాట్లాడుతుంది అనే సిద్ధాంతాన్ని నమ్మడం వల్లే మేము సైలెంట్‌గా ఉన్నాం. ఇప్పటికే చాలా భరించాం. మా సహనాన్ని కొంతమంది చేతకానితనంగా భావించి ఈ బాయ్‌కాట్‌ ట్రెండ్‌ని అలవాటుగా మార్చుకున్నారు.
సోషల్‌మీడియాలో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వార్తలు, హ్యాష్‌ట్యాగ్స్‌ సృష్టిస్తూ మాపై బురద జల్లుతున్నారు. ఇప్పటికైనా బాలీవుడ్ నటీనటులు అందరూ కలిసి ఈ బాయ్ కాట్ ట్రెండ్‌ని సృష్టిస్తోన్న వారిపై చర్యలు తీసుకోవాలి" అని అర్జున్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఇలా బాలీవుడ్ సినిమాలను బాయ్ కాట్ చేయడం వల్ల మున్ముందు.. హిందీ ఇండస్ట్రీ మనుగడకే ప్రమాదమయ్యేలా కనిపిస్తోంది. వచ్చిన ప్రతి సినిమాను బాయ్ కాట్ చేస్తే.. అక్కడి నటీనటుల కెరీర్ కు చెక్ పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు.



Tags:    

Similar News