రివ్యూ : ట్రయాంగిల్ లవ్ స్టోరీ "బేబీ" హిట్ కొట్టిందా ?

వైషూ కాలేజీలో చేరినప్పటి నుంచి.. ఆనంద్ తన స్నేహితుల మాటలు నమ్మి ఆమెపై అనుమానం పెంచుకోవడం, ఆమె స్టైల్ లో..

Update: 2023-07-14 05:15 GMT

baby movie review

సినిమా : బేబీ

నటీనటులు : ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్, నాగబాబు, సాత్విక్ ఆనంద్, బబ్లూ, లిరీష, కుసుమ తదితరులు
సంగీతం : విజయయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ : ఎంఎన్ బాల్ రెడ్డి
రచన, దర్శకత్వం : సాయి రాజేష్ నీలం
నిర్మాత : ఎస్ కె ఎన్
విడుదల తేదీ : 14.07.2023
ఇటీవల కాలంలో సినిమా విడుదలకు ముందే.. ఆ సినిమా నుంచి వచ్చే పాటలు సూపర్ హిట్ అవుతూ.. సినిమాలపై అంచనాలు క్రియేట్ చేస్తున్నాయి. అలా కేవలం ఒకే ఒక్క పాట.. ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. పాటతో అంచనాలు క్రియేట్ అయిన సినిమా "బేబీ". పాట విడుదలై చాలాకాలం అయింది. ఈ మధ్యే ట్రైలర్ ను విడుదల చేసిన చిత్రబృందం.. అందులోనే కథేంటో చెప్పేసింది. ట్రైలర్ చూసిన యువతకు.. ఈ కథ తమ జీవితంలోనో లేక తెలిసిన వారి జీవితంలోనో జరిగిన కథగా అనిపించింది. అయినా సరే.. సినిమాలో డైరెక్టర్ ఏం చూపించాడో చూసేందుకు.. థియేటర్లకు క్యూ కట్టారు ప్రేక్షకులు. మరి ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన "బేబీ" హిట్ కొట్టిందో లేదో చూద్దాం.

కథలోకి వెళ్తే..

వైషు అలియాస్ వైష్ణవి (వైష్ణవి చైతన్య) ఓ బస్తీ అమ్మాయి. చిన్నప్పటి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవరకొండ)ను ప్రేమిస్తుంది. ఆమె ప్రేమను అతను కూడా అంగీకరిస్తాడు. స్కూల్ డేస్ లోనే గాఢంగా ప్రేమించుకున్న వీరిద్దరి ప్రేమ కు పదో తరగతి ఫలితాలు బ్రేక్ వేస్తాయి. వైష్ణవి టెన్త్ పాసై కాలేజీ చదువులకు సిటీకి వెళ్లగా.. ఆనంద్ పదో తరగతి ఫెయిల్ అయి ఊర్లోనే ఆటో డ్రైవర్ గా స్థిరపడతాడు. వైష్ణవి ఇంటర్ పూర్తి చేసి ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్కడ ఏర్పడిన కొత్త పరిచయాలతో వైష్ణవి ఆలోచనలో, వేష ధారణలోనూ మార్పులొస్తాయి. ఈ క్రమంలోనే విరాజ్ (విరాజ్ అశ్విన్) కు దగ్గరవుతుంది. తొలుత స్నేహంగా మొదలైన పరిచయం.. ఆ తర్వాత అడ్డదారులు తొక్కుతుంది. అనుకోని పరిస్థితుల కారణంగా వైష్ణవి విరాజ్ కు శారీరకంగా దగ్గరవుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది ? వైష్ణవి - విరాజ్ ల విషయం ఆనంద్ కు తెలిసిందా ? ఆనంద్, విరాజ్ లలో వైష్ణవి నిజంగా ఎవరిని ప్రేమించింది. విరాజ్ కు శారీరకంగా దగ్గరైనా మళ్లీ ఆనంద్ దగ్గరకే వెళ్తుందా ? వైషుకు ఎదురైన ఆ పరిస్థితులేంటి ? అన్నది తెలియాలంటే తెరపై సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

బేబీ సినిమా ట్రైలర్ మొదట్లో.. మొదటి ప్రేమకు మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుందని ఒక డైలాగ్ వినిపిస్తుంది. ఈ డైలాగ్ కు తగ్గట్టే సినిమా అంతా సాగుతుంది. స్కూల్ డేస్ లో తెలిసీ తెలియని వయసులో ఓ అమ్మాయి - అబ్బాయిల మధ్య పుట్టిన ప్రేమకథ.. వారికి వయసు ఎదిగే కొద్దీ అది ఎలాంటి మలుపులు తిరిగింది ? అని చూపంచారు. ఇలాంటి తొలిప్రేమ కథలు చాలామంది జీవితాల్లో కనిపిస్తూనే ఉంటాయి. వాటిలో కొన్ని మాత్రమే పెళ్లిపీటల వరకూ వస్తాయి. చాలా వరకూ విషాద ప్రేమ కథలే. అలాంటి సున్నితమైన ప్రేమ కథే ఈ "బేబీ". ఈ కథ నేటితరం యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. సినిమాలో చూసే సీన్స్.. చాలా మందికి తమ జీవితంలో జరిగినట్టు అనిపిస్తాయి.
వైషూ కాలేజీలో చేరినప్పటి నుంచి.. ఆనంద్ తన స్నేహితుల మాటలు నమ్మి ఆమెపై అనుమానం పెంచుకోవడం, ఆమె స్టైల్ లో వచ్చిన మార్పు చూసి మరింత ఆందోళన పడటం.. వెరసి ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు రావడం అన్నీ సహజంగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ కథలో హీట్ పెంచుతుంది. సెకండాఫ్ ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ కొంచెం తడబడినట్లుగా ఉంటుంది. విరాజ్ మనసులో ఏం ఉందో తెలుసుకున్న వైష్ణవి.. అతని నుంచి దూరంగా ఉండే ప్రయత్నంలో పడే మానసిక సంఘర్షణ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ మాత్రం ప్రేక్షకుల్ని నిరాశపరుస్తుంది. గతంలో బాధాకరమైన క్లైమాక్స్ లతో వచ్చిన సినిమాలను గుర్తు చేస్తుంది.

ప్లస్ పాయింట్స్

+ కథ నేపథ్యం
+ యూత్ కి కనెక్టయ్యే సీన్లు
+ పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్స్

- సెకండాఫ్ లో సాగదీత
- క్లైమాక్స్
చివరిగా.. నేటితరం యువతలో ఎంతోమంది జీవితాల్లో కనిపించే "బేబీ"


Tags:    

Similar News