భీమ్లా నాయక్ ఎఫెక్ట్.. ఆ రెండు సినిమాలు వాయిదా పడ్డట్లేనా ?
ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లలో విడుదలయ్యేందుకు భీమ్లా నాయక్ రెడీ అవుతున్నాడు. అయితే.. అదే రోజున మరో రెండు సినిమాలు కూడా..;
పవన్ కల్యాణ్ - రానా కలిసి నటించిన భీమ్లా నాయక్ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారయింది. ఫిబ్రవరి 25వ తేదీన థియేటర్లలో విడుదలయ్యేందుకు భీమ్లా నాయక్ రెడీ అవుతున్నాడు. అయితే.. అదే రోజున మరో రెండు సినిమాలు కూడా విడుదల కానున్నాయి. వాటిలో ఒకటి వరుణ్ తేజ్ నటించిన "గని". మరొకటి శర్వానంద్ - రష్మికలు జంటగా వస్తోన్న "ఆడవాళ్లు మీకు జోహార్లు". అయితే.. ఇప్పుడు ఈ రెండు సినిమాలు అదే రోజు విడుదలవుతాయా ? లేదా ? అన్న సందేహం ఉంది అభిమానుల్లో.
మొదట భీమ్లా నాయక్ ను ఫిబ్రవరి 25, లేదా ఏప్రిల్ 1న విడుదల చేస్తామని చెప్పింది చిత్ర బృందం. దాంతో శర్వానంద్ నటించిన "ఆడవాళ్లు మీకు జోహార్లు" మేకర్స్.. సినిమాను ఫిబ్రవరి 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు, ప్రమోషన్స్ శరవేగంగా జరిగిపోతున్నాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్ "గని" సినిమాను కూడా అదే రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటన వచ్చింది. ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి 25ను లాక్ చేసిన తర్వాత.. భీమ్లా నాయక్ మేకర్స్ ఫిబ్రవరి 25నే సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read : ఇద్దరూ ఒక కులపోళ్లే.... కలవడం గొప్పేముంది?
పవన్ కల్యాణ్ సినిమా అంటే.. ఆయన ఫ్యాన్స్ ఏ రేంజ్ లో హడావిడి చేస్తారో చెప్పనక్కర్లేదు. పవన్ సినిమా కాబట్టి ఆ ఎఫెక్ట్ గని, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలపై పడే అవకాశం ఉంది. దాంతో గని సినిమాను మేకర్స్ మార్చి 4వ తేదీన విడుదల చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆడవాళ్లు మీకు జోహార్లు టీమ్ కూడా సినిమాను వాయిదా వేయొచ్చన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా పోస్టర్లను ఫిబ్రవరి 25 తేదీతోనే విడుదల చేస్తున్నారు. ఈ రెండు సినిమాల మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకూ వేచి చూడాల్సిందే.