ప్రముఖ డైరెక్టర్, నటుడిపై కేసు.. పోక్సో చట్టం ఉల్లంఘన ?
సినిమాలోని కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మహరాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీమ దేశ్‌పాండే ముంబై సెషన్స్ కోర్టులో..
ముంబై : బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్, నటుడు మహేశ్ మంజ్రేకర్ పై కేసు నమోదైంది. ఇటీవల మహేశ్ మంజ్రేకర్ "నయ్ వరణ్ భట్ లోంచా కోన్ నై కొంచా" అనే మరాఠి సినిమాను తీశారు. ఈ సినిమా ఎక్కువగా పిల్లలపైనే చిత్రీకరించారు. పిల్లలపై జరిగే అకృత్యాలు, వాళ్లని బానిసలుగా చూసే అంశాలపై ఈ సినిమా రూపుదిద్దుకుంది. కాగా.. సినిమాలో మైనర్ పిల్లలపై అభ్యంతరకర సన్నివేశాలను చూపించారన్న ఆరోపణలు వచ్చాయి. ముంబైలోని మహిమ్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలైందని, కేసు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు.
Also Read : భీమ్లా నాయక్ ఫస్ట్ డే కలెక్షన్స్.. వసూళ్ల సునామీ
సినిమాలోని కొన్ని సీన్లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మహరాష్ట్రకు చెందిన సామాజిక కార్యకర్త సీమ దేశ్‌పాండే ముంబై సెషన్స్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సినిమాలో నటించిన పిల్లలంతా మైనర్లని, అలాంటి వారితో అభ్యంతకర దృశ్యాలను చిత్రీకరించడం పోక్సో చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు. సీమ దేశ్‌పాండే ఫిర్యాదు మేరకు మహేశ్ మంజ్రేకర్‌పై ఐపీసీ 292, 34 సెక్షన్లతో పాటు పోక్సో సెక్షన్ 14, ఐటీ యాక్ట్ 67, 67బీ కింద కేసు నమోదు చేశారు. కాగా.. మహేశ్ మంజ్రేకర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. అదుర్స్, డాన్ శీను, అఖిల్, గుంటూరు టాకీస్, సాహో లాంటి సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేసి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు.