రూ.100 కోట్ల క్లబ్ లోకి కార్తికేయ 2.. తనను ఆ డైరెక్టర్లతో పోల్చద్దన్న చందూ మొండేటి
మీరు మాటిమాటికి వాళ్లతో నన్ను పోల్చకండి. వాళ్లిద్దరికీ నేను ఏకలవ్య శిష్యుడిని. నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ గా చేస్తావా?..
చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా ఆగస్టు 13న విడుదలైన సినిమా కార్తికేయ 2. తెలుగు సహా ఇతర భాషల్లో విడుదలైన ఈసినిమా తొలిరోజే సక్సెస్ టాక్ తెచ్చుకుని భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. 15 రోజుల్లోగానే కార్తికేయ 2 రూ.100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సందర్భంగా శక్రవారం రాత్రి కర్నూల్ లో కార్తికేయ 2 టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకుంది. "ఒక రాజమౌళి .. ఒక సుకుమార్ మాదిరిగా చందూ మొండేటి కూడా 100 కోట్ల సినిమా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు" అంటూ యాంకర్ స్టేజ్ పై చెబుతుండగా, అందుకు చందూ మొండేటి అడ్డుపడ్డాడు.
"మీరు మాటిమాటికి వాళ్లతో నన్ను పోల్చకండి. వాళ్లిద్దరికీ నేను ఏకలవ్య శిష్యుడిని. నెక్స్ట్ సినిమాకి డైరెక్టర్ గా చేస్తావా? వాళ్ల దగ్గర అసిస్టెంట్ గా చేస్తావా? అని అడిగితే, వాళ్ల దగ్గరే జాయినైపోతాను" అని చందూ మొండేటి చెప్పుకొచ్చారు. రాజమౌళిగారన్నా.. సుకుమార్ గారన్నా తనకెంతో ఇష్టమని, అంతకుమించిన గౌరవం కూడా ఉందని తెలిపారు. అలాంటి వారిద్దరితో తనను పోల్చుతుంటే భయమేస్తుందన్నారు చందూమొండేటి. "ఇంతకుముందు ఏ మాత్రం పరిచయం లేని నిఖిల్ గురించి ఈ రోజున హిందీ వాళ్లంతా మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా సాధించిన సక్సెస్ కి ఇంతకుమించిన నిదర్శనం లేదు" అంటూ సింపుల్ గా తన స్పీచ్ ను ముగించారు.