నంది అవార్డులపై మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

నంది అవార్డులపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Update: 2023-12-30 02:35 GMT

నంది అవార్డులపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త సంవత్సరంలో నంది అవార్డులు తప్పకుండా ఇస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌లో సీనియర్ నటుడు మురళీమోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న ఉగాది పండుగ నాటికి నంది అవార్డులు ఇచ్చేలా ప్లాన్ చేస్తామని.. పార్టీలు, ప్రాంతాలకు అతీతంగా నంది అవార్డులు ఇస్తామని స్పష్టం చేశారు. సీఎంతో చర్చించిన తర్వాత సినీ పెద్దలను చర్చలకు ఆహ్వానిస్తామని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమను సత్కరిస్తే మా ప్రభుత్వానికే పేరు వస్తుందని అన్నారు. చిన్నప్పటి నుంచి నంది అవార్డులు ఇవ్వడాన్ని తానూ చూస్తూ వచ్చానని, అవార్డులు ఇచ్చి గౌరవించుకోవటం అవసరమని కోమటిరెడ్డి చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని ఓప్పించి, అవార్డులపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. మూడు, నాలుగు రోజుల్లోనే సీఎం రేవంత్‌తో సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పేరున్న ‘నంది’ అవార్డులను 2017లో చివరిసారిగా ప్రకటించారు. ఆ తర్వాత ఈ అవార్డుల ప్రదానంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇలాంటి సమయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నంది అవార్డులపై కీలక ప్రకటన చేశారు. మురళీమోహన్ మాట్లాడుతూ.. సినిమా అవార్డులను ఇవ్వాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కేసీఆర్ హయాంలో ‘సింహా’ అవార్డులు ఇవ్వాలనుకున్నా.. అది కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కళాకారులను పోత్సాహిస్తే.. రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు.



Tags:    

Similar News