నాకు నేషనల్ అవార్డు వచ్చిందని నేనే షాక్ అయ్యా.. అల్లు అర్జున్!
బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్ మొదటిసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడాడు. నాకు నేషనల్ అవార్డు వచ్చిందని నేనే షాక్ అయ్యా..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నేషనల్ అవార్డుకు ఎంపికైన విషయం అందరికి తెలిసిందే. పుష్ప (Pushpa) సినిమాకు గాను ఉత్తమ నటుడిగా బన్నీ ఈ పురస్కారం అందుకోబోతున్నాడు. ఈ అవార్డు రావడం పట్ల అల్లు అర్జున్ అభిమానులను మాత్రమే టాలీవుడ్ లోని ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమకు ఇప్పటివరకు బెస్ట్ యాక్టర్ అవార్డు రాలేదు.
69 ఏళ్ళ జాతీయ పురస్కార వేడుకల్లో ఈ అవార్డు అందుకున్న మొట్టమొదటి తెలుగు యాక్టర్ గా అల్లు అర్జున్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక ఈ అవార్డు ప్రకటన తరువాత బన్నీ తొలిసారి మీడియా ముందు మాట్లాడాడు. "పుష్ప సినిమాకి నేషనల్ అవార్డు కోసం అనేక విభాగాల్లో నామినేషన్లు వేశాం. ఏదొక క్యాటగిరీలో అవార్డు వస్తుందని అనుకున్నాం. బెస్ట్ యాక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ విభాగంలో అవార్డు వరించింది. వేరే క్యాటగిరీలో కూడా అవార్డులు వస్తాయని మేము భావించాం" అని చెప్పుకొచ్చాడు.
ఇక తనకి బెస్ట్ యాక్టర్ అవార్డు రావడం పై స్పందిస్తూ.. "ఈసారి ఉత్తమ నటుడు క్యాటగిరీ కోసం 20 మంది నటులు పోటీ పడ్డారు. వారిలో ఎక్కువ మంది నార్త్ నుంచే ఉన్నారు. అవార్డులు ప్రకటిస్తున్న సమయానికి సుకుమార్, నేను టీవీ ముందే కూర్చున్నాము. ఉత్తమ నటుడు అవార్డు ప్రకటించగానే సుకుమార్ ని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేశాను. ఈ అవార్డు తనదే, ఎందుకంటే తను చెప్పినట్లే నేను నటించాను" అంటూ వెల్లడించాడు.
బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్న మొదటి నటుడు కావడంపై రియాక్ట్ అవుతూ.. "తెలుగులో మొదటిసారి నాకే నేషనల్ అవార్డు వచ్చిందని విని నేనే షాక్ అయ్యా. ఒకసారి క్లారిటీగా చూడమని చెప్పను. నేను ఏ మూడు, నాలుగు స్థానాల్లో ఉంటానని అనుకున్నాను. కానీ మీడియా ఛానల్స్ కూడా నేనే మొదటి నటుడిని అని చెప్పడంతో షాక్ అయ్యా. నాకంటే గొప్ప నటులు ఉన్నారు. కానీ ఆ సమయంలో వారికి ఎందుకో కుదరలేదు" అని పేర్కొన్నాడు.