చంద్రబాబును కలిసేందుకు రాజమండ్రి జైలుకు రజిని.. క్లారిటీ ఇచ్చిన తలైవా..
చంద్రబాబును కలిసేందుకు రజినీకాంత్ రాజమండ్రి జైలుకు రానున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దీని పై..
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని (Chandrababu Naidu) సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచారు. ఇక చంద్రబాబు అరెస్ట్ పై రెండు తెలుగు రాష్ట్రాలతో పటు కర్ణాటక మరియు విదేశాల్లో కూడా అనేకమంది నిరసనలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే సినిమా వర్గాల నుంచి కూడా చంద్రబాబు అరెస్ట్ సరి కాదంటూ వాదనలు వినిపిస్తున్నారు.
కాగా ఇటీవల పవన్ కళ్యాణ్, బాలకృష్ణ.. రాజమండ్రి జైలుకి వెళ్లి చంద్రబాబుని కలుసుకున్న సంగతి తెలిసిందే. వీరిలాగానే చంద్రబాబు మిత్రుడు, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కూడా రాజమండ్రి జైలుకి రానున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రజిని నిజంగా వస్తున్నాడా..? లేదా..? అనేదాని పై సస్పెన్స్ నెలకుంది. తాజాగా దీని గురించి రజినీకాంత్ ఒక క్లారిటీ ఇచ్చాడు.
ఈ ఆదివారం రజిని తన ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఫంక్షన్ లో పాల్గొనేందుకు చెన్నై నుంచి కోయంబత్తూరుకు బయలుదేరాడు. ఈక్రమంలోనే చెన్నై విమానాశ్రయంకు చేరుకున్న రజినిని మీడియా ప్రతినిధులు.. చంద్రబాబుతో ములాఖత్ అయ్యేందుకు ఎప్పుడు వెళ్తున్నారు అని ప్రశ్నించారు. దీనికి రజినీకాంత్ బదులిస్తూ.. "చంద్రబాబుని కలుసుకోవడానికి వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఫ్యామిలీ ఫంక్షన్ వల్ల అది కుదరలేదు" అని బదులిచ్చాడు.
దీంతో చంద్రబాబుతో రజిని ములాఖత్ పై ఒక క్లారిటీ వచ్చింది. కాగా రజినీకాంత్ ఇప్పటికే ఈ విషయం గురించి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ కి ఫోన్ చేసి మాట్లాడట. చంద్రబాబు గొప్ప పోరాట యోధుడని, ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్షని, త్వరలోనే తన మిత్రుడు బయటకు వస్తాడని, అప్పటివరకు ధైర్యంగా ఉండాలని లోకేశ్ కి రజిని ధైర్యం చెప్పాడట. కాగా త్వరలోనే రజినీకాంత్.. రాజమండ్రి జైలుకి వచ్చి చంద్రబాబుని కలుసుకొని అవకాశాలు ఎక్కువే ఉన్నాయని తెలుస్తుంది.