సినిమా పవిత్రమైన దేవాలయం.. ఎన్టీఆర్, చరణ్ ల వల్లే ఇది సాధ్యం : ఎస్ఎస్ రాజమౌళి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను దృష్టిలో ఉంచుకుని తాను సినిమాలు చేస్తాను.. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రానికి..
RRR సినిమాతో.. టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి పేరు ప్రఖ్యాతలతో పాటు.. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ల క్రేజ్ అంతర్జాతీయంగా ఊహించని స్థాయికి చేరుకున్నాయి. రాజమౌళికి బాహుబలితోనే అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చినా.. RRRతో అది మరింత పెరిగింది. ప్రపంచ చిత్ర రంగంలో విశిష్ట పురస్కారంగా భావించే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డును ఎస్ఎస్ రాజమౌళి.. ఓ కార్యక్రమంలో అందుకున్నారు. ఈ అవార్డు ప్రదానోత్సవానికి రాజమౌళి తన కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఆస్కార్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఉరకలేస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ఈ అవార్డు గొప్ప ఉత్తేజాన్నిస్తుందన్నారు. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ రేసులో ఉండటానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ అని రాజమౌళి ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఎఫ్ సీసీ అవార్డును అందుకున్న రాజమౌళి తొలుత భావోద్వేగానికి గురయ్యారు. ఇంత ప్రతిష్ఠాత్మకమైన వేదికపై నిలబడి మాట్లాడాలంటే.. చాలా కంగారు పుట్టిస్తోందన్నారు. తన దృష్టిలో సినిమా అంటే.. ఒక పవిత్రమైన దేవాలయం వంటిదని రాజమౌళి అభివర్ణించారు. బాల్యంలో థియేటర్ కు వెళ్లి సినిమా చూసిన అనుభూతులు ఇంకా పదిలంగా ఉన్నాయని తెలిపారు. ఏ సినిమాలోనైనా.. ఓ సీన్ షూట్ చేసేముందు అది థియేటర్ లో తెరపై ఎలా ఉంటుంది అని ఊహించుకుని చిత్రాలు చేస్తానని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను దృష్టిలో ఉంచుకుని తాను సినిమాలు చేస్తాను.. కానీ ఆర్ఆర్ఆర్ చిత్రానికి విదేశీయుల నుండి కూడా ఇంత ఆదరాభిమానాలు లభించడం.. తనను ఆశ్చర్య పరుస్తోందన్నారు. చాలా మంది సినిమా యూనిట్ అంటే కుటుంబం వంటిదని మాటవరుసకు చెప్తుంటారు కానీ.. తనకు మాత్రం నిజంగా కుటుంబమే సినిమా యూనిట్ అని తెలిపారు. తన సినిమాలకు కథలు తండ్రి విజయేంద్రప్రసాద్ రాస్తే.. పెద్దన్న కీరవాణి సంగీతం సమకూర్చుతారని, తన అర్ధాంగి రమ కాస్ట్యూమ్ డిజైనర్ గా, కుమారుడు కార్తికేయ, వదిన వల్లి లైన్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తారని, అన్నయ్య కీరవాణి కుమారుడు కాలభైరవ సింగర్ గా, మరో సోదరుడు శివశ్రీ కాంచీ రచయితగా తన వెంట నిలిచే బృందం అని వివరించారు. తాను ఎలాంటి విజయం సాధించినా, ఏ అవార్డు అందుకున్నా కుటుంబానికి కృతజ్ఞతలు చెప్పుకుంటానని తెలిపారు.