‘‘నాపైన ఇది వరకు చాలామంది ప్రభావం ఉండేది. వాళ్ల ఆలోచనలకి తగ్గట్టే సినిమా చేయాల్సి వచ్చేది తప్ప నాకు నేనుగా నిర్ణయం తీసుకొనేవాణ్ని కాదు. ఈసారి మాత్రం నా సొంత నిర్ణయం మేరకే సినిమా చేశాను’’ అని చెప్పుకొచ్చాడు అక్కినేని హీరో సుశాంత్. ఈ ప్రయత్నం ఆయనకి కలిసొచ్చినట్టే కనిపిస్తోంది. ఆయన నటించిన తాజా చిత్రం 'చిలసౌ'కి విడుదలకి ముందే మంచి బజ్ వచ్చింది. ఇక ప్రేక్షకుల నోటి నుంచి హిట్టు అనే మాట రావడమే మిగిలి ఉందని చెబుతున్నాడు సుశాంత్. మరి అది జరుగుతుందా లేదా అనేది రెండు రోజుల్లోనే తెలిసిపోతుంది.
ఎవరా నిర్మాత..?
అయితే ఇండస్ట్రీలో మాత్రం సుశాంత్‌కి ఆ నిర్మాత దూరం కావడంతోనే మేలు జరిగిందని చెబుతున్నారు. ఆ నిర్మాత ఎవరో కాదు.. చింతలపూడి శ్రీనివాసరావు. ఇదివరకు నాగ్ సినీ కార్పొరేషన్ పేరుతో సుశాంత్ ఫ్యామిలీ, చింతలపూడి శ్రీనివాసరావు కలిసి ఓ నిర్మాణ సంస్థని ఏర్పాటు చేశారు. ఆ సంస్థలోనే సుశాంత్ సినిమాలు తెరకెక్కేవి. కథల విషయంలో ఎక్కువగా సుశాంత్ తల్లి నాగసుశీల, చింతలపూడి నిర్ణయాలే ఉండేవి. అయితే కొంతకాలం కిందట వ్యాపార లావాదేవీల విషయంలో నాగసుశీలకీ, చింతలపూడికీ మధ్య విభేదాలొచ్చాయి. ఆ వ్యవహారం పోలీసు స్టేషన్ల దాకా వెళ్లింది. ఆ తర్వాత చింతలపూడి శ్రీనివాసరావు.. సుశాంత్ కుటుంబానికీ దూరమయ్యారు. ఈ దశలోనే సుశాంత్ సొంతంగా నిర్ణయం తీసుకొని 'చిలసౌ' పట్టాలెక్కించారు. ఇదివరకటిలా హీరోయిజంతో కూడిన కథల్ని పక్కనపెట్టి సున్నితమైన కథని ఎంచుకొని ఈ చిత్రం చేశాడు. టీజర్లు, ట్రైలర్లు బాగా ఆకట్టుకొన్నాయి. దాంతో చిలసౌకి మంచి బజ్ ఏర్పడింది. ఈ సినిమా నిర్మాతలు కూడా బయట వ్యక్తులే. దాంతో సుశాంత్ అన్ని రకాలుగా కొత్త చిత్రం చేసినట్టైంది. సినిమా నాగార్జునకి నచ్చడంతో ఆయన ఈ చిత్రంలో భాగస్వామి అయ్యారు. నాగచైతన్య, సమంత కూడా సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకొంటున్నారు.