ఇదే రోజున విడుదలైన ఆ సినిమాలన్నీ హిట్లే.. సరికొత్త రికార్డులు
ఆ తర్వాత 1994 ఏప్రిల్ 28న కమెడియన్ అలీ హీరోగా వచ్చిన సినిమా యమలీల. ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి వచ్చి ప్రయోగాత్మక చిత్రమిది
ఏప్రిల్ 28.. ఈ తేదీకొక ప్రత్యేకత ఉంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చాలా సినిమాలు ఈరోజునే విడుదలై.. సరికొత్త రికార్డులు సృష్టించిన రోజు ఇది. ఏదైనా సినిమా విడుదలైన తర్వాత సూపర్ హిట్ అయితే.. ఆ తేదీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకుంటారు. అలాంటి రోజే ఏప్రిల్ 28. మరి ఈ రోజున ఏయే సినిమాలు విడుదలయ్యాయి ? ఎంత మంది హీరోలు సరికొత్త రికార్డులు సృష్టించారో తెలుసుకుందాం.. రండి !
1977లో రికార్డు మొదలైంది. సీనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన అడవి రాముడు 1977, ఏప్రిల్ 28న విడుదలైంది. ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర దర్శకత్వం వహించారు. తెలుగు తెరకు అసలైన కమర్షియల్ హంగులను పరిచయం చేసింది ఈ సినిమానే. అప్పట్లోనే ఈ సినిమా రూ.3 కోట్లు వసూలు చేసింది అడవి రాముడు సినిమా. 32 సెంటర్లలో 100రోజులు, 16 కేంద్రాల్లో 175 రోజులు, 8 సెంటర్లలో 200 రోజులు, విజయవాడలోని అప్సర థియేటర్లో 302 రోజులు అడవిరాముడు సినిమా ఆడిందని సమాచారం.
ఆ తర్వాత 1994 ఏప్రిల్ 28న కమెడియన్ అలీ హీరోగా వచ్చిన సినిమా యమలీల. ఎస్వీ కృష్ణారెడ్డి నుంచి వచ్చి ప్రయోగాత్మక చిత్రమిది. ఒక కమెడియన్ ను హీరోగా చూడటానికి ఎంతమాత్రం ప్రేక్షకులు ఇష్టపడరు. అలాంటిది అలీని హీరోగా చూపించడంలో కృష్ణారెడ్డి 100 శాతం సక్సెస్ అయ్యారు. తల్లీకొడుకుల సెంటిమెంట్ కు ఫాంటసీని జోడించి ట్రెండ్ సెట్ చేశారు.ఈ సినిమా కూడా 100 లకు పైగా థియేటర్లలో రన్ అయింది. హైదరాబాద్ లోని కొన్ని థియేటర్లలో 400 రోజులు ప్రదర్శించారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇదే రోజున విడుదలైన మరో సినిమా పోకిరి. 2006లో పూరీ జగన్నాథ్ - మహేశ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 13 ఏళ్ల క్రితమే రూ.12 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ.66 కోట్లు వసూలు చేసి.. అప్పటి వరకూ ఉన్న వసూళ్ల రికార్డులను తిరగరాసి చరిత్ర సృష్టించింది. 200 సెంటర్లలో 100 రోజులు, 63 సెంటర్లలో 175 రోజులు, 15 సెంటర్లలో 200 రోజులు, కర్నూల్ లోని ఓ థియేటర్లో అయితే ఏడాదికి పైగా పోకిరి సినిమా ఆడిందంటే మామూలు విషయం కాదు మరి.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అనే క్యూరియస్ క్వశ్చన్ కి సమాధానంగా.. బాహుబలి 1కి సీక్వెల్ గా వచ్చింది బాహుబలి 2. ఈ సినిమా కూడా ఏప్రిల్ 28నే విడుదలై.. కొత్త రికార్డు సృష్టించింది. కొన్నేళ్ల వరకూ ఈ రికార్డును ఎవరూ దాటలేరన్న రేంజ్ లో వసూళ్లు వచ్చాయి. రూ.250 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 2017, ఏప్రిల్ 28న విడుదలై.. రూ.1800 కోట్లు వసూలు చేసింది.