భారీ వరదలు.. ఒక్కరోజే 33 మంది మృతి
ఒక్కరాష్ట్రంలోనే 22 మంది మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉండటం విషాదం. మరో 10 మంది గాయపడగా.. మండి
మూడు రోజులుగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా చెరువులు, నదులు నిండి వరదలు సంభవించాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని బ్యారేజీలు, ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. పలు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కాగా.. హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలకు కొండచరియలు విరిగి పడిన వేర్వేరు ఘటనల్లో 31 మంది మరణించారు.
హిమాచల్ ప్రదేశ్ లో శుక్రవారం నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండగా.. ఈ ఒక్కరాష్ట్రంలోనే 22 మంది మృతిచెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఉండటం విషాదం. మరో 10 మంది గాయపడగా.. మండి ప్రాంతంలో ఆరుగురు గల్లంతయ్యారు. ఉత్తరాఖండ్ లో నలుగురు మృతి చెందగా.. పదిమంది గల్లంతయ్యారు. భారీ వరదల వల్ల ఒడిశాలో 500 గ్రామాల్లోని నాలుగున్నర లక్షల మంది ప్రజలు వరద ప్రాంతాల్లో చిక్కుకున్నారు.
వరదలు, వర్షాల కారంగా జమ్ము-కాశ్మీర్ లో ఇటీవల వైష్ణోదేవి యాత్ర ఆగిపోయింది. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో తిరిగి ఆదివారం ఉదయం నుంచి యాత్ర ప్రారంభమైంది. నేడు, రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అక్కడి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది.