అఖిలపక్ష సమావేశం హైలెట్స్: మణిపూర్ హింసపై చర్చకు కేంద్రం రెడీ
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు
రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్ సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు గాను కేంద్ర ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని ఇవాళ నిర్వహించింది. ఈ సమావేశంలో సభకు సంబంధించిన పలు అంశాలపై అన్ని అన్ని పార్టీల సభ్యులతో కేంద్రం చర్చించింది. ఈ సందర్బంగా పార్టీలు పలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకు వచ్చింది. ఈ సందర్భంగా సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారు. ఈ వర్షకాల సమావేశాల్లో మొత్తం 17 సెషన్లు ఉండనున్నాయి. ఇటీవల ప్రారంభించిన పార్లమెంట్ కొత్త భవనంలోనే కాకుండా.. పాత భవనంలో సమావేశాలు జరగనున్నాయి.
రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ మంగళవారమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయగా.. చాలా పార్టీల నాయకులు అందుబాటులో లేకపోవడంతో అది ఈ రోజుకు వాయిదా పడింది. కాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ప్రభుత్వంపై మూకుమ్మడి ప్రశ్నలతో దాడి చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి. మరోవైపు మణిపూర్ పరిస్థితిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి చెప్పారు. "నిబంధనలు ప్రకారం మణిపూర్ పరిస్థితి గురించి (పార్లమెంట్‌లో) చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది" అని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి పార్లమెంటు వర్షాకాల సమావేశానికి ముందు జరిగిన అఖిలపక్ష సమావేశం తర్వాత చెప్పారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకించింది. బీఆర్‌ఎస్ కూడా అఖిలపక్ష సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించింది.
రేపటి నుంచి అంటే జూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 31 బిల్లులు పెట్టాలని కేంద్రం భావిస్తోంది. సమాజ్‌వాదీ పార్టీ యూనిఫాం సివిల్ కోడ్‌పై చర్చను కోరుతున్నట్లు ఎస్టీ హసన్ చెప్పారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఎస్టీ హసన్ మాట్లాడుతూ.. "మేము యూనిఫాం సివిల్ కోడ్ ( యుసి సి) పై చర్చను కోరుకుంటున్నాము. మా అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో సహా మా పార్టీ ఎల్లప్పుడూ ఆ బిల్లును రూపొందించడానికి వ్యతిరేకిస్తుంది. ఇది సమాజంలో విభజన తెస్తుందని' అని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్‌ని వ్యతిరేకిస్తున్నట్టు ఐయూఎమ్‌ఎల్ నాయకుడు ఈటీ ముహమ్మద్ బషీర్ తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మాట్లాడుతూ.. మణిపూర్ సమస్యపై ప్రధాని సభలో ప్రకటన ఇవ్వాలని, తమకు చర్చించడానికి అవకాశం ఇవ్వాలని తమ పార్టీ మొదటి డిమాండ్ అని తెలిపారు. రేపు దీని మీద వాయిదా తీర్మానం తీసుకురావాలనుకుంటున్నామని చెప్పారు.
అంతేకాకుండా దేశంలోని ప్రధాన భాగం వరదలతో కొట్టుమిట్టాడుతోంది. దీని గురించి కూడా చర్చించాలన్నారు. (బాలాసోర్) రైల్వే ప్రమాదం గురించి కూడా చర్చ జరగాలన్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో పాటు రాజ్యాంగ సంస్థలపై కూడా చర్చించాలన్నారు. భారత్-చైనా సరిహద్దు పరిస్థితులు, రెండు దేశాల మధ్య వాణిజ్యం కూడా చర్చకు తీసుకోవాలన్నారు. మరోవైపు మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని బీజేపీ కోరింది. అఖిలపక్ష సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒడిశాకు ప్రత్యేక కేటగిరీ హోదాను ఆమోదించాలని కోరింది బీజేపీ పార్టీ రాజ్యసభ నాయకుడు సస్మిత్ పాత్ర కోరారు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో బీజేపీ, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం దాడులకు దిగడంతో పార్లమెంట్ సమావేశాలు రసవత్తరంగా మారనున్నాయి. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ధరల పెరుగుదల, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం వంటి సమస్యలతో పాటు మణిపూర్ సంక్షోభంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్నాయి. గత సెషన్ కూడా తరచూ విపక్షాల నిరసనలతో హోరెత్తింది.