Auto Expo : ఆటో ఎక్స్ పోలో అదిరిపోయే కార్లు... కావాలంటే ఒక లుక్కేయండి?

ఈ నెల 17వ తేదీ నుంచి ఢిల్లీలో ఆటో ఎక్స్ పో ప్రారంభం కానుంది;

Update: 2025-01-15 08:39 GMT

ఈ నెల 17వ తేదీ నుంచి ఢిల్లీలో ఆటో ఎక్స్ పో ప్రారంభం కానుంది. అంటే ఎల్లుండి నుంచి ప్రారంభం కానున్న ఈ ఆటో ఎక్స్ పో లో అనేక మోడల్ కార్లు మీకు దర్శనమిస్తున్నాయి. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ 2025 ప్రారంభం కానుండటంతో ఔత్సాహికులకు ఇక పండగేనని చెప్పాలి. అనేక భారతీయ కంపెనీలు కూడా ఈ ఆటో ఎక్స్ పోలో తమ కార్లను ప్రదర్శించబోతున్నాయి. ఇప్పటికే ఉన్న మోడల్స్ తో పాటు ఫ్యూచర్ లో తమ కంపెనీల నుంచి విడుదలయ్యే అన్ని రకాల మోడళ్ల కార్లను ఈ ఆటో ఎక్స్ పోలు ప్రదర్శించనున్నాయి.

కార్లంటే కొందరికి...
కార్లంటే కొందరికి పిచ్చి. డబ్బున్న వాళ్లు.. లేని వారి దగ్గర నుంచి కారు అంటే అదొకరకమైన స్టేటస్ సింబల్. ఎవరి స్థాయికి తగినట్లు వారు తమ ఆదాయం, తమకు వెసులు బాటును దృష్టిలో పెట్టుకుని కార్లను కొనుగోలు చేస్తుంటారు. కేవలం కార్లు మోడల్స్ ను నచ్చడమే కాదు.. అందులో ఉండే ఫీచర్లకు ఫిదా అయిపోయి వెంటవెంటనే కార్లను మార్చేవాళ్లు కూడా దేశంలో అనేక మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఒక వాహనం జీవిత కాలం పదిహేనేళ్లయితే.. అంత కాలం ఒకే కారును మెయిన్ టెయిన్ చేయరు. ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి వచ్చే కొత్త మోడల్స్ ను కొనుగోలు చేయడానికి పరితపిస్తుంటారు. అందుకు ఎంత సొమ్మును వెచ్చించడానికైనా వెనుకాడరు. అది కొందరికి బలహీనత.. మరికొందరికి అలవాటు అని చెప్పాలి.
ఫీచర్లతో కలిపి...
తాజాగా న్యూఢిల్లీలో ప్రారంభం కానున్న ఈ ఎక్స్ పోలో కూడా పేరున్న కంపెనీలన్నీ తమ కొత్త మోడల్స్ ను ప్రదర్శించనుండటంతో పెద్దయెత్తున ఆసక్తి ఉన్నవారు వచ్చే అవకాశముంది. అందులోనూ ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి గిరాకీ ఉంది. ప్రతి కంపెనీ కూడా ఎలక్ట్రిక్ వాహనాన్ని తయారు చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. ఇక ఫ్యూచర్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలవే కావడంతో భారత్ మార్కెట్ లోకి త్వరలోనే విడుదలయ్యే అన్ని రకాల వాహనాలను ముందుగానే ఈ ఎక్స్ పోలో చూసే అవకాశముందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఎక్స్ పోకు వస్తే కావాల్సిన ఫ్యూచర్స్ ను తెలుసుకోవడమే కాకుండా, తమకు అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది? ధర ఎంత ఉంటుందన్న అంచనాకు కూడా వచ్చే అవకాశముంటుంది.
అన్ని ప్రముఖ కంపెనీలు...
మారుతి సుజుకి హుండాయ్, టాగా మోటార్స్, మహీంద్రా, ఎంజీ, కియా, స్కోడా ఇలా ఒక్కటేమిటి అన్ని రకాల ప్రముఖ కంపెనీలు తాము త్వరలో విడుదల చేయబోయే వాహనాల వివరాలను ఎక్స్ పోలో ఆవిష్కరించనున్నాయి. ఇందులో ఉండే ఫీచర్లతో పాటు అప్ డేటెడ్ డిజైన్, వీల్స్, అధునాతన సాంకేతికత, మైలేజీ, బ్యాటరీ బ్యాకప్ వంటి వివరాలను తెలుసుకునే వీలుంది. అందుకే ఢిల్లీలో ఎల్లుండి జరిగే ఆటో ఎక్స్ పోకు మంచి ఆదరణ లభిస్తుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఎప్పటి నుంచి తమ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి? ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంటుంది? అన్న వివరాలను తెలుసుకోవాలంటే ఒకసారి ఆటో ఎక్స్ పోకు వెళ్లి చూడాల్సిందే. మరి ఇక ఆలస్యమెందుకు?


Tags: