Corona Virus : కరోనా మళ్లీ మాయమయినట్లేనా..? వారికి అవసరమైనప్పుడే కేసులు వస్తాయా?
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ కనిపించడం లేదు. కరోనాకు సంబంధించి అప్‌డేట్ కూడా ఇవ్వడం లేదు.
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ కనిపించడం లేదు. కరోనాకు సంబంధించి అప్‌డేట్ కూడా ఇవ్వడం లేదు. దీంతో కరోనా ముప్పు తప్పినట్లేనని అభిప్రాయపడుతున్నారు. జనవరి, ఫిబ్రవరి నెల వరకూ కరోనా కేసులు అన్ని రాష్ట్రాల్లో నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రధానంగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదయినట్లు కూడా గణాంకాలు తెలిపాయి. JN 1 సబ్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని కూడా తెలిపింది.
JN 1 సబ్ వేరియంట్...
JN 1 సబ్ వేరియంట్ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీచేసింది కూడా. డిసెంబరు నెల నుంచి ఫిబ్రవరి మొదటి వారం వరకూ ఈ కేసులు ఎక్కువగానే అనేక రాష్ట్రాల్లో నమోదయినట్లు తెలిపింది. JN 1 సబ్ వేరియంట్ తొలిసారి డిసెంబరు 8న కేరళలో కనుగొనడంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అందరూ మాస్క్ లు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలంటూ మళ్లీ వార్నింగ్ ల మీద వార్నింగ్ లు వచ్చేశాయి. దీంతో ప్రజలు మరోసారి కరోనా కబళిస్తుందేమోనని భయపడిపోయారు. బయటకు వచ్చేందుకే జంకారు.
కొద్దిరోజులుగా...
అయితే గత కొద్ది రోజులుగా కరోనా కేసులు ఉన్నట్లుండి మాయమయ్యాయి. అంటే కరోనా ముప్పు తొలగినట్లేనా? అన్న దానిపై ఇటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కాని, కేంద్ర ప్రభుత్వం కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియాలో మాత్రం కరోనాపై అనేక నెగిటివ్ కామెంట్స్ వినపడుతున్నాయి. మందుల కంపెనీలకు అవసరమైనప్పుడల్లా కరోనా తొంగి చూస్తుంటుందని, సాధారణ జలుబు, దగ్గు వంటి వాటికి కూడా కరోనా భయం పెట్టి సొమ్ము చేసుకోవడానికే ఈ ప్రయత్నమని విమర్శలు నెట్టింట కనిపిస్తున్నాయి. కానీ కరోనా వైరస్ వల్ల మొదటి, రెండు వేవ్ లలో లక్షలాది మంది మరణించిన విషయాన్ని కొందరు గుర్తు చేస్తున్నారు. అలాంటిదేమీ లేదని, కొందరు కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అధికారులు చెబుతున్నారు. చలి, శీతాకాలంలో మాత్రమే వైరస్ వ్యాప్తి చెందుతుందని, వేసవి కాలంలోనూ, ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు వైరస్ బలహీనపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నాయి. ప్రస్తుతమయితే కరోనా ముప్పు మాత్రం తొలగినట్లేనన్నది అధికారిక వర్గాల అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.