HMPV Virus : హెచ్ఎంపీవీ వైరస్ మళ్లీ పుంజుకుంటుందా? భారత్ లో మరిన్ని కేసులు పెరుగుతాయా?

హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారత్ లో మరింతగా పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు;

Update: 2025-01-15 12:30 GMT

హెచ్ఎంపీవీ వైరస్ కేసులు భారత్ లో మరింతగా పెరిగే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వివిధ రకాల పండగలు, కుంభమేళా వంటి వాటితో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతుందని అంటున్నారు. ప్రజలు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా వైరస్ మాత్రం విస్తృతంగా వ్యాపించే అవకాశాలున్నాయని వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకటి కాదు రెండు కాదు.. ఇలా అనేక చోట్ల పండగ వేళ జనం ఒకే చోట గుమికూడుతున్నారు. మాస్క్ లు ధరించడం లేదు. అలాగే భౌతిక దూరాన్ని పాటించేందుకు కూడా వీలులేదు. అదే సమయంలో శానిటైజర్ల వాడకం కూడా లేకపోవడంతో వైరస్ విస్తృతంగా వ్యాపించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ...
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగ గత మూడు రోజుల నుంచి జరుగుతుంది. తెలంగాణలో ఈ పండగకు కైట్ ఫెస్టివల్, ఫుడ్ కోర్టుల వంటివి ఏర్పాటు చేస్తున్నారు. వీటికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే చెప్పాల్సిన పనిలేదు. కోడిపందేలు, ఎడ్ల పందేలు, బండ లాగుడు పోటీలు.. ముగ్గుల పోటీలు ఇలా ఒకటేమిటి.. జనం గుమికూడటానికి అవసరమైన అన్ని పరిస్థితులు నెలకొన్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో అనేక చోట్ల జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. వీటికి వేల సంఖ్యలో జనం హాజరవుతున్నారు. ఒక్కొక్క బరి వద్ద వేలాది మంది ఒక్కచోట చేరడంతో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.
కుంభమేళా దెబ్బకు...
ఇక తమిళనాడులోనూ జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. అక్కడ కూడా ఇసుకేస్తే రాలనంత జనం హాజరవుతున్నారు. ఈ సమయంలోనే వాతావరణం కూడా వైరస్ వ్యాప్తికి కారణమవుతుందని చెబుతున్నారు. శీతాకాలపు చల్లటి గాలులు ఎక్కువగా వేస్తుండటంతో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో మహా కుంభమేళా ప్రారంభమయింది. ఈ కుంభమేళాకు ముప్ఫయి నుంచి నలభై కోట్ల మంది జనం హాజరవుతారని అంచనాలు వినిపిస్తున్నాయి. విదేశాల నుంచి కూడా ఎక్కువ మంది భక్తులు కుంభమేళాకు తరలి వస్తున్నారు. ఇప్పటికే చైనాలో విజృంభిస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ నేడు దేశంలో జరుగుతున్న వివిధ పండగలు, మహా కుంభమేళా వంటి వాటితో వైరస్ కేసులు పెరిగే అవకాశముందని చెబుతున్నారు. ఇప్పటికే భారత్ లో హెచ్ఎంపీవీ కేసులు ఇరవైకి దాటాయని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు పాటించాలని కేంద్ర వైద్య ఆరోగయ శాఖ సూచించంది.


Tags:    

Similar News